దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్‌’లో అగ్ని ప్రమాదం

Fire Rages At South Africa Parliament Building At Cape Town - Sakshi

కేప్ టౌన్: కేప్‌టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ భవన సముదాయంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలున్న పురాతన పార్లమెంట్‌ భవనం మూడో అంతస్తులో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. అనంతరం అగ్ని కీలలు పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్‌ నేషనల్‌ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. పార్లమెంట్‌ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని మంత్రి పాట్రీసియా చెప్పారు.

ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్‌ స్పీకర్‌ నొసివివే అన్నారు.  అగ్ని కీలల వేడికి ఆ కాంప్లెక్స్‌లోని మిగతా భవనాలు దెబ్బతినడంతోపాటు, అందులోని కళాఖండాలు ధ్వంసమయ్యే ప్రమాదముందని మంత్రి పాట్రీసియా ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా సందర్శించారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్‌ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్‌ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్‌టౌన్‌ నగరం లెజిస్లేటివ్‌ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్‌ ఫోంటెన్‌ న్యాయ రాజధానిగాను ఉన్నాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top