
ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభనుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దఫా ప్రసంగించడం లేదు. వార్షిక సమావేశాల్లో ప్రసంగించే వివిధ దేశాల నేతల పేర్ల జాబితాను శుక్రవారం ఐరాస విడుదల చేసింది. ఇందులోని వక్తల జాబితాలో ప్రధాని మోదీ పేరు లేదు. ఈ నెల 9వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ఉన్నత స్థాయి సాధారణ చర్చ ఈ నెల 23–29వ తేదీల మధ్య జరుగుతుంది.
ఆనవాయితీ ప్రకారం మొదటగా బ్రెజిల్, తర్వాత అమెరికా దేశాల నేతలు ప్రసంగిస్తారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 23వ తేదీన మొదటిసారిగా ఐరాస జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడనున్నారు. జూలైలో విడుదల చేసిన జాబితాలో సెప్టెంబర్ 26వ తేదీన భారత్ నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ఐరాస విడుదల చేసిన జాబితా పేర్కొంది. తాజా లిస్ట్‌లో మాత్రం 27న భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ప్రసంగిస్తారని ఉంది.
26న ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నేతల ప్రసంగాలుంటాయి. అయితే, ఇది తుది జాబితా మాత్రం కాదు. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, వారు ప్రసంగించే తేదీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెబుతున్నారు. ఐరాస 80వ సెషన్ ఈసారి ‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌మెంట్, హ్యూమన్ రైట్స్’ఇతివృత్తంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలు కొనసాగుతున్న వేళ జరిగే ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు. వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అయితే, రష్యా నుంచి భారీ చమురుకొంటూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల భారత్‌పై ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లను విధించడం తెల్సిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తన జోక్యమే కారణమని పదేపదే ప్రకటించుకోగా వాటిని భారత్ ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఐరాస సమావేశాల్లో పాల్గొనడం లేదని పరిశీలకులు అంటున్నారు.