ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. కానీ..
కాలం మారిపోయింది. పెళ్లి పనులన్నీ ఇప్పుడు... ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. మరి ఇంటి సంగతేమిటి?
ఇదీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈకాలంలో ఇళ్లు కట్టి చూడవచ్చు.. కాదంటే ప్రింట్ చేసుకోవచ్చు..
ఇదీ వద్దనుకుంటే... నట్లు బోల్టులేసుకుని బిగించుకోనూ వచ్చు!
ఈ మధ్య ఫ్రాన్స్‌లో ఓ అపార్ట్‌మెంట్ కట్టారు. కట్టారు అనడం కంటే ప్రింట్ చేశారనడం కరెక్ట్. ఎందుకంటే పన్నెండు పోర్షన్లు ఉన్న ఈ మూడంతస్తుల బిల్డింగ్‌లో గోడలన్నీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసినవే మరి. అక్కడక్కడ స్తంభాలు పాతి... కాలమ్స్, పైకప్పులు అమర్చి సిద్ధం చేశారు. ఆ తరువాత తలుపులు, కిటికీలు, వైరింగ్, బాత్రూమ్ ఫిట్టింగ్ వంటివి అమర్చడంతో సాధారణ పద్ధతుల్లో కట్టేదాని కంటే మూడు నెలల ముందుగానే ‘విలియా స్ప్రింట్’పూర్తయింది.
ఫ్రాన్స్‌లోని చారిత్రక నగరం రీమ్స్‌లోని బెజాన్స్ ప్రాంతంలో విలియా స్ప్రింట్ నిర్మాణం జరిగింది. ఒక్కో అపార్ట్‌మెంట్ సుమారు 800 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంది. ప్రత్యేకమైన, ఫైబర్ కలిపిన కాంక్రీట్ వాడి గోడలు కూడా నిర్మాణం తాలూకూ బరువును మోసేలా చేశారు. దీనివల్ల స్తంభాల సంఖ్య గణనీయంగా తగ్గింది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వాడటం పుణ్యమా అని కాంక్రీట్‌ను సమర్థంగా వినియోగించుకోగలిగారు.
పది శాతం వరకూ ఆదా చేయగలిగారు. గత ఏడాది మార్చిలో త్రీడీ ప్రింటింగ్ మొదలై 34 రోజుల్లో ముగిస్తే ఆ తరువాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఈ భవనం ఈ ఏడాది ఏప్రిల్‌లో గృహప్రవేశానికి సిద్ధమైంది. విలియా స్ప్రింట్ నిర్మాణానికి కోబోడ్ బాడ్–2 అనే భారీ త్రీడీ ప్రింటర్‌ను వినియోగించారు. ఇదే మెషీన్ గతంలో భూకంపాలను తట్టుకోగల ఇల్లు, డేటా సెంటర్‌ను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.
సూపర్ స్పెషల్ ఏర్పాట్లు...
త్రీడీ టెక్నాలజీ వాడటం ఒక్కటే విలియా స్ప్రింట్ ప్రత్యేకత కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. హోల్‌సిమ్ అనే సంస్థ నిర్మాణ స్థలంలోనే కాంక్రీట్‌ను తయారు చేసి ఇవ్వడం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అలాగే సుమారు 5400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సౌర శక్తి ఫలకాలు, హైబ్రిడ్ గ్యాస్/హీట్ పంప్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ భవన విద్యుత్తు అవసరాలను 60 శాతం వరకూ తీరుస్తాయి.
ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌గా విలియా స్ప్రింట్ రికార్డు నెలకొల్పింది. కాకపోతే ఈ బిల్డింగ్ డెవలపర్ ప్లూరియల్ నోవిలియా త్వరలోనే రెండు త్రీడీ ప్రింటర్లను వాడి ఏకకాలంలో 40 అపార్ట్‌మెంట్లను కట్టే ఆలోచనలో ఉన్నందున ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఇదిలా ఉంటే 2030 నాటికి 25 శాతం ఇళ్లను త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో పూర్తి చేసేందుకు దుబాయ్ ప్రయత్నిస్తోంది.
భారత్‌లోనూ ఊపందుకుంటోంది...
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది అటు తయారీ రంగంలో.. ఇటు గృహనిర్మాణ రంగంలోనూ ఊపందుకుంటోంది. యూరోపియన్ దేశాల మాదిరిగా మరీ విస్తృతంగా కాకున్నా బుడిబుడి అడుగులైతే పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం మద్రాస్ ఐఐటీ ‘త్వస్త’పేరుతో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆరువందల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఇల్లు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్శించింది కూడా. త్వస్తతోపాటు ప్రఖ్యాత ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ కూడా గృహనిర్మాణాన్ని వేగంగా, చౌకగా పూర్తి చేసేందుకు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మరోవైపు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోనూ ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


