
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తక్షణమే నిలిపేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని యురోపియన్ యూనియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్ కోరారు. ఉక్రెయిన్ రక్షణ, భద్రత, శాశ్వత స్థిరత్వానికి యూరప్ నుంచి మద్దతను ఆమె పునరుద్ఘాటించారు. కీవ్‌పై రష్యా వైమానిక దాడుల్లో 21 మంది మరణించడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పుతిన్ చర్చలకు రావాలి, సామాన్య పౌరులు, మౌలిక సదుపాయాలపై రష్యా నిరంతర దాడులను యూరప్ సహించబోదన్నారు. ఉక్రెయిన్‌కు విశ్వసనీయ భద్రతా హామీలతో పాటు న్యాయమైన, శాశ్వత శాంతి నెలకొల్పేందుకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పారు. అందుకోసం ధైర్యవంతులైన ఉక్రేనియన్ సాయుధ దళాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తామన్నారు. దాడిని అంతకుముందు ఎక్స్‌లోనూ ఆమె ఖండించారు.
‘రష్యా కనికరంలేని బాంబు దాడుల్లో మరో రాత్రి పీడకలలా మిగిలింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఇది కీవ్‌లోని మా ప్రతినిధి బృందాన్ని కూడా తాకింది. మా ప్రతినిధి బృందం సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. పౌర మౌలిక సదుపాయాలపై రష్యా తన విచక్షణారహిత దాడులను వెంటనే ఆపాలి. న్యాయమైన, శాశ్వత శాంతి కోసం చర్చలలో చేరాలి’ అని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ దాడులను బ్రిటన్ సైతం ఖండించింది. శాంతి చర్చలకు ఎదురుదెబ్బగా అభివర్ణించింది.