
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు చేస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిలో ఓటరు నమోదు కోసం పౌరసత్వానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేశారు. ఇటువంటి మార్పులు చేర్పుల కారణంగా చట్టపరమైన సవాళ్లు ఎదురుకానున్నాయి.
ట్రంప్ సంతకం చేసిన ఉత్తర్వులోని వివరాల ప్రకారం ఇంతవరకూ అమెరికాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ(Election process)లో అత్యవసమైన ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే ఓటరు జాబితాలను వెలువరించడంలో, ఎన్నికల సంబంధిత నేరాలను విచారించడానికి అందరూ సమాఖ్య సంస్థలకు సహకరించాలని ఆ ఉత్తర్వులో కోరారు. ఎన్నికల నిబంధనలను పాటించని రాష్ట్రాలు సమాఖ్య నిధులలో కోతలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆ ఉత్తర్వులో హెచ్చరించారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. సమాఖ్య ఎన్నికలలో ఓటు వేసేందుకు పాస్‌పోర్ట్ వంటి పౌరసత్వ రుజువును తప్పనిసరి చేశారు.
ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్-ఇన్ బ్యాలెట్(Mail-in ballot)లను రాష్ట్రాలు ఇకపై అంగీకరించకూడదని దీనిలో స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం తాము తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల్లో అక్రమాలు, మోసాలను అరికట్టేందుకేనని పేర్కొంది. ముఖ్యంగా మెయిల్-ఇన్ ఓటింగ్ సందర్భంలో డాక్యుమెంట్ మోసాలు జరుగుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నప్పుడు ట్రంప్ అమెరికా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావించారు. ఈ తాజా ఉత్తర్వు ఇటువంటి అవకతవకలను అంతం చేస్తుందని పేర్కొన్నారు.
రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఈ ఉత్తర్వుకు మద్దతు ప్రకటించారు. ఇది ఎన్నికల సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోపగడుతుందని పేర్కొన్నారు. జార్జియా విదేశాంగ కార్యదర్శి బ్రాడ్ రాఫెన్స్‌పెర్గర్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు అమెరికన్ పౌరులు మాత్రమే ఇక్కడి ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా ఉందని పేర్కొన్నారు. మరోవైపు డెమొక్రాట్లు ఈ ఉత్తర్వును ఖండించారు. కొందరు ఓటర్లు ఓటు హక్కును కోల్పోతారని వారు పేర్కొన్నారు. 2023 నాటి ఒక నివేదిక ప్రకారం అర్హత కలిగిన అమెరికా పౌరులలో తొమ్మిది శాతం మందికి పౌరసత్వ రుజువు అందుబాటులో లేదని తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటివరకూ ఎన్నికల సమయంలో 18 రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత అందుకున్న మెయిల్ బ్యాలెట్‌లను ఆ తేదీకి ముందు పోస్ట్‌మార్క్ చేసినంత వరకు అంగీకరిస్తూ వస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇకపై ఈ పద్ధతికి స్వస్తి పలికారు. కాగా కొలరాడో డెమోక్రటిక్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జెనా గ్రిస్వోల్డ్ మాట్లాడుతూ ఈ ఉత్తర్వు సమాఖ్య ప్రభుత్వం వాడుతున్న చట్టవిరుద్ధమైన ఆయుధంగా అభివర్ణించారు. ట్రంప్ ఓటర్ల సంఖ్యను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం