
‘షిపోకలిప్స్’ అంటూ సోషల్ మీడియాలో ఫొటో
యుద్ధ శాఖగా అమెరికా రక్షణ విభాగం పేరు మార్పు
మరిన్ని నగరాలకూ ఇదే ట్రీట్‌మెంట్ అంటూ ప్రకటన
డెమొక్రాట్ల ప్రాబల్య ప్రాంతాలపైనే ప్రత్యేకంగా గురి
సొంత నగరంపైనే యుద్ధమా: ఇల్లినాయీ గవర్నర్
వాషింగ్టన్/షికాగో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదం చివరికి సొంత దేశాన్ని కూడా వదలడం లేదు. అమెరికాలో మూడో అతి పెద్ద నగరమైన షికాగోపై ఆయన అక్షరాలా యుద్ధమే ప్రకటించారు! విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆధిపత్యమున్న షికాగో నుంచి వలసదార్లను వెళ్లగొట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికా రక్షణ శాఖ పేరునే ఏకంగా యుద్ధ శాఖగా మారుస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు.
1979లో వియత్నాం యుద్ధం సమయంలో తెరకెక్కించిన ‘అపోకలిప్స్ నౌ’ చిత్రం పోస్టర్‌ను అనుకరిస్తూ ‘షిపోకలిప్స్ నౌ’ పేరిట ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రంప్ స్వయానా పోస్టు చేశారు. షికాగోపై ఎగురుతున్న హెలికాప్టర్లు, నీటిపై ప్రజ్వరిల్లుతున్న మంటలు అందులో కనిపిస్తున్నాయి. ఆ సినిమాలో యుద్ధోన్మాది అయిన లెఫ్టినెంట్ కల్నల్ కిల్గోర్ పాత్రలో ట్రంప్ దర్శనిమిస్తున్నారు.
అందులోని ఫేమస్ డైలాగ్‌ను గుర్తుకు తెస్తూ ‘ఈ ఉదయం డిపోర్టేషన్ల వాసనను ఆస్వాదిస్తున్నా’ అంటూ పోస్టు చేశారు. ‘డిపార్టుమెంట్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటున్నామో షికాగో తెలుసుకోనుంది’ అని పేర్కొన్నారు. బాల్టిమోర్, న్యూ ఆర్లీన్స్‌కు సైతం ఇలాంటి ట్రీట్‌మెంట్ తప్పదంటూ సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌పైనా గురిపెట్టారు. షికాగోకు నేషనల్ గార్డ్ దళాలు, ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను కూడా పంపించబోతున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ విపక్ష డెమొక్రటిక్ పార్టీకి బలమున్న ప్రాంతాలే కావడం గమనార్హం. లాస్ ఏంజెలెస్‌లో ఇ్పటికే నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దించడం తెలిసిందే. ఇప్పుడు షికాగోలో వాటితో పాటు ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించబోతున్నారు.
భయం గుప్పెట్లో షికాగో
ట్రంప్ హెచ్చరికలతో షికాగోలోని విదేశీయులు, ప్రధానంగా లాటిన్ మూలాలున్న వాళ్లు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ పౌరసత్వాన్ని ధ్రువీకరించుకోవడానికి అమెరికా పాస్‌పోర్టులను నిత్యం దగ్గరే ఉంచుకుంటున్నారు. ట్రంప్ తీరును నిరసిస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో జనం కదం తొక్కుతున్నారు.
ఉడుత ఊపులకు బెదరం: ప్రిట్జ్‌కెర్
ట్రంప్ తీరును ఇల్లినాయిస్ గవర్నర్ జె.బి.ప్రిట్జ్‌కెర్ తప్పుపట్టారు. ఆయన నియంతగా మారజూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘సొంత దేశంలోని నగరంపై యుద్ధోన్మాదం ప్రదర్శిస్తున్నారు. ఇది జోక్ కాదు. సాధారణ విషయం అంతకన్నా కాదు. ట్రంప్ బలమైన నాయకుడు కాదు. పిరికి వ్యక్తి అలాంటి వాళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడబోరు’’ అని తేల్చిచెప్పారు.