త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే! | Donald Trump statement on Iran attacks | Sakshi
Sakshi News home page

త్వరలో యుద్ధానికి తెర.. లేదు వినాశనమే!

Apr 2 2026 4:49 AM | Updated on Apr 2 2026 12:10 PM

Donald Trump statement on Iran attacks

ట్రంప్‌ పూటకో మాట 

నాటోకు గుడ్‌బై అంటూ సంకేతాలు

వాషింగ్టన్‌/దుబాయ్‌: ఇరాన్‌పై దాడులకు తెర దించే విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. రెండు మూడు వారాల్లో పోరుకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతానని మంగళవారం ఆయన ప్రకటించారు. నాటో కూటమి నుంచి అమెరికా వైదొలిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోదనని నమ్మకం కలిగిన వెంటనే దాడులు నిలిపేస్తా. 

కాల్పుల విరమణకు ఇరాన్‌ అంగీకరిస్తుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా ఆ మేరకు నిర్ణయం తీసుకుంటా’’ అని చెప్పారు. హార్మూజ్‌ జలసంధిని తెరిపించే బాధ్యతను అక్కడి నుంచి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకే వదిలేస్తానని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. మరోవైపు గల్ఫ్‌లో అమెరికా సేనల మోహరింపు మాత్రం పెరుగుతూనే ఉంది. మరో 10 వేల మందికి పైగా సైనికులను తరలిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి! 

యూఎస్‌ఎస్‌ జార్జి డబ్ల్యూ బుష్‌ విమాన వాహక నౌక కూడా మూడు డిస్ట్రాయర్‌ నౌకలు, 6,000 మంది సెయిలర్లతో గల్ఫ్‌ బాట పట్టినట్టు పెంటగాన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇరాన్‌పై భూతల దాడుల నిమిత్తమేనన్న అనుమానాలకు ఊతమిచ్చేలా ట్రంప్‌ బుధవారం తన ట్రూత్‌ సోషల్‌ సైట్‌లో పోస్టులు చేశారు. ‘‘హార్మూజ్‌ను తక్షణం తెరవాల్సిందే. లేదంటే బాంబులతో ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం. దాంతో ఆ దేశం రాతియుగాల కాలానికి వెళ్తుంది’’అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు! 

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కాల్పుల విరమణ కోరుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్‌ మాత్రం వాటిని తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ వ్యాఖ్యలు నిరాధారమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యుద్ధాన్ని కొనసాగించి తీరతామని పునరుద్ఘాటించింది. స్వీయరక్షణ విషయంలో డెడ్‌లైన్లేవీ ఉండబోవని విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘యుద్ధ విరమణ దిశగా పశ్చిమాసియాలో అమెరికా దూత స్టీవ్‌ విట్కాఫ్‌ నుంచి పలు ప్రతిపాదనలు అందడం నిజమే. కానీ అమెరికాతో మా దేశం నేరుగా ఎలాంటి చర్చలూ జరపడం లేదు’’అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement