
వాషింగ్టన్: జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని, దీని ప్రకారం జపాన్ వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఈ ఒప్పందానికి జపాన్ అంగీకరించకపోతే ఆగస్టు ఒకటి నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.
జపాన్‌తో ఒప్పందంపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, జపాన్‌లు పరస్పరం 15 శాతం ఒప్పందపు రేటుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఒప్పందం ప్రకారం తన ఆదేశాల మేరకు జపాన్.. అమెరికాలో 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఫలితంగా ఆ దేశం 90 శాతం లాభాలను పొందుతుందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము జపాన్‌తో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, బహుశా ఇప్పటివరకు అమెరికాతో ఆ దేశం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రాశారు.
Donald J. Trump Truth Social :
We just completed a massive Deal with Japan, perhaps the largest Deal ever made. Japan will invest, at my direction, $550 Billion Dollars into the United States, which will receive 90% of the Profits. This Deal will create Hundreds of Thousands of… pic.twitter.com/GBIUPiey6z— Markets Today (@marketsday) July 23, 2025
అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. కానీ ఈ ఒప్పందం లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ట్రంప్ తెలియజేశారు. కార్లు, ట్రక్కులు, బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి గేట్లు తెరుచుకుంటాయని, ఇకపై అమెరికాకు జపాన్ 15 శాతం పరస్పర సుంకాలను చెల్లిస్తుందన్నారు. ఆగస్టు ఒకటి వరకూ విధించిన గడువుకు ముందే వరుస ఒప్పందాలను కుదుర్చుకుంటామని గతంలో పేర్కొన్న ట్రంప్ ప్రస్తుతం అదేపనిలో తలమునకలై ఉన్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రిటన్ వియత్నాంతో ఇటీవలే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జపాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు.