
ముందుకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీవ్: రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ముందుకువచ్చారు. తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య బుధవారం మరో దఫా చర్చలు జరగనున్నాయన్నారు. ఈసారి మరింత మంది యుద్ధ ఖైదీల విడుదలతోపాటు రష్యా నిర్బంధంలో ఉన్న తమ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతామన్నారు. అయితే, ఇలాంటి చర్చలతో పెద్దగా ఫలితం కనిపించదని ఆయన పేర్కొన్నారు.
యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ ముఖాముఖి చర్చలే మార్గమని చెప్పారు. ‘ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎన్నడూ కోరుకోలేదు. అనవసరమైన ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యాయే. కాబట్టి, ఆ దేశమే ఈ యుద్ధానికి స్వస్తి చెప్పాలి’అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి పెద్ద సంక్షోభానికి ముగింపు పలికేందుకు జెలెన్‌స్కీ గతంలోనూ పలుమార్లు ముఖాముఖి చర్చలకు ముందుకు వచ్చినా పుతిన్ ముఖం చాటేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపును సైతం పుతిన్ పట్టించుకోలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా గ్లైడ్ బాంబులు
మరోవైపు, రష్యా సైన్యం ఉక్రెయిన్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని వెయ్యి కిలోమీటర్ల పొడవైన యుద్ధక్షేత్రంలో ముందుకు చొచ్చుకువెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. సుమీ, ఒడెసా, క్రమటోర్‌స్క్ ప్రాంతాల్లోని నాలుగు నగరాలపై ప్రమాదకర గ్లైడ్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒక చిన్నారి సహా 24 మంది గాయపడ్డారు. క్రమటోర్‌స్‌్కలోని ఓ నివాస భవన సముదాయంలో మంటలు చెలరేగాయి. డ్రోన్ దాడితో సుమీలోని పుటివ్‌ల్‌లో గ్యాస్ స్టేషన్‌కు మంటలు అంటుకున్నాయి. ఇలా ఉండగా, మాస్కోతోపాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రయోగించిన 35 లాంగ్ రేంజ్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.