
అందుబాటులోకి తెచ్చిన చైనా కంపెనీ
ఇంట్లో మనిషిలా, ఇంటి పనిమనిషిలా
ప్రయోగాలకు కూడా అనువుగా తయారీ
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్‌ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్
యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.
గంటపాటు నిర్విరామంగా..
» ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ.
» వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్ ్స, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది.
» కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం.
» బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది.
» మాన్యువల్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది.
» పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.
ఆర్1.. ఒక మైలురాయి
ఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్‌ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట.
చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్‌ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్‌ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
రోజువారీ జీవితంలో మమేకం..
» మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది.
» కాఫీ మెషీన్ ను ఆన్ చేస్తుంది.
» ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది.
» ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్‌ను చదువుతుంది.
» మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్‌గా కూడా మారుస్తుంది.
» అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతై ్తన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది.
» ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది.