China Zero Covid policy: యూనివర్సిటీలు ఖాళీ

China Zero Covid policy: Students sent home, police on patrol as China curbs protests - Sakshi

ఖాళీ అవుతున్న చైనా వర్సిటీలు, విద్యా సంస్థలు 

‘జీరో కోవిడ్‌’ వ్యతిరేక పోరాటాన్ని అణచివేయడానికి ప్రభుత్వం వ్యూహం

బీజింగ్‌:  చైనాలో ‘జీరో కోవిడ్‌’ నిబంధనలకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై షీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలు, ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేస్తోంది. తాజాగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులను వారి ఇళ్లకు బలవంతంగా పంపిచేస్తుండడం గమనార్హం. దీంతో విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కరోనా నిబంధనలను సడలించాలని, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. డ్రాగన్‌ దేశంలో ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లువెత్తడం గత కొన్ని దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. పోలీసులు, సైనిక సిబ్బంది భారీ సంఖ్యలో మోహరించడంతో బీజింగ్, షాంఘై సహా పలు నగరాల్లో మంగళవారం ఆందోళనలు పెద్దగా కనిపించలేదు. మరోవైపు ‘జీరో కోవిడ్‌’ వ్యూహాన్ని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా సంకేతాలిచ్చింది.  

అప్పట్లో వర్సిటీలే ఉద్యమ కేంద్రాలు  
అధినేత షీ జిన్‌పింగ్‌ చదువుకున్న తిసింగువా యూనివర్సిటీ నుంచి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. రాజధాని బీజింగ్‌లోని పాఠశాలలు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నాయి. గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని విద్యాసంస్థలు కూడా విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపించాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు బస్సులను సమకూర్చాయి. ఇకపై తరగతులు, వార్షిక పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తేల్చిచెప్పాయి. ఇళ్లకు వెళ్లిపోవాలని కోరుకొనే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తామని బీజింగ్‌ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ప్రకటించింది.

చైనాలో 1980వ దశకంలో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో యూనివర్సిటీ క్యాంపస్‌లే ఉద్యమ కేంద్రాలుగా మారాయి. 1989లో చరిత్రాత్మక తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద విద్యార్థుల ఊరేగింపుపై సైన్యం దాడి చేసింది. యూనివర్సిటీల్లో విద్యార్థులు లేకుండా చేయడం ద్వారా జీరో కోవిడ్‌ వ్యతిరేక పోరాటాన్ని నీరుగార్చాలన్నదే ప్రభుత్వ వ్యూహమని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో పనిచేస్తున్న చైనా రాజకీయ వ్యవహారాల నిపుణుడు డాలీ యాంగ్‌ విశ్లేషించారు.

చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిత్యం 30 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జనం రాకపోకలపై అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీలు విద్యార్థులను ఇళ్లకు పంపిస్తుండడం గమనార్హం.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top