ఎస్కలేటర్‌ మీదనుంచి అరుపులు.. ఠక్కున పరిగెత్తి..

China Woman Saves Elderly Man Life From Escalator - Sakshi

బీజింగ్‌ : మనకు కావచ్చు.. ఇతరులకు ఎవరికైనా కావచ్చు.. ప్రమాదం జరిగినపుడు దాన్నుంచి బయటపడటం, బయటపడేయటం ఎలా అని ఆలోచించి, వెంటనే నిర్ణయం తీసుకోవటం మీదే ప్రాణాలు ఉండటమో.. పోవటమో ఆధారపడి ఉండి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోయినా.. ఆలస్యం చేసినా ప్రాణాలు పోతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటాన్నే ఇంగ్లీష్‌లో క్విక్‌ థింకింగ్‌ అంటారు. ఈ క్విక్‌ థింకింగ్‌ చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో చైనాకు చెందిన ఈ స్టోరీ లోని యువతి ఒకరు. వేగంగా ఆలోచించి ఓ ముసలాయన ప్రాణాలు కాపాడింది ఆ యువతి. వివరాలు.. కొద్దిరోజుల క్రితం సౌత్‌ చైనాకు చెందిన ఓ యువతి అక్కడి ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లింది. షాపులో ఏదో కొంటూ ఉంది. ఈ నేపథ్యంలో కుడివైపు నుంచి అరుపులు వినపడ్డంతో అటు చూసింది. ఎస్కలేటర్‌ మీదనుంచి ఓ వీల్‌ ఛైర్‌ వేగంగా వస్తోంది. అందులో ఓ ముసలాయన కూర్చుని ఉన్నాడు. అది అత్యంత వేగంగా కిందకు వస్తోంది.

దీంతో సదరు యువతి ఇక ఏమాత్రం ఆలోచించకుండా వీల్‌ చేయిర్‌కు ఎదురుగా పరిగెత్తింది. వేగంగా కిందకు వచ్చిన దాన్ని పట్టుకుని, అతి కష్టం మీద ఆపేసింది. ఆయన ప్రాణాలు కాపాడింది. షాపు యజమానురాలు కూడా ఆమెకు సహాయం చేసేందుకు వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. సదరు యువతి క్విక్‌ థింకింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఓ మనిషి ప్రాణాలు రక్షించటానికి ధైర్యం చూపిన ఆమెను మెచ్చుకుంటున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను గాయపడతానని తెలిసినా లెక్కచేయలేదు. ఆయన ప్రాణాలు రక్షించాలనుకున్నాను’’ అని చెప్పింది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top