అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే! | China to US: The Game Is Ours Now | Sakshi
Sakshi News home page

అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!

May 22 2026 10:16 AM | Updated on May 22 2026 5:25 PM

China to US: The Game Is Ours Now

ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్‌ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్‌ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్‌ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.

ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్‌ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.

ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.

బలప్రయోగం కాదు, కానీ..
ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్‌, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్‌ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.

ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్‌ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్‌ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.

తగ్గేదే లే!
అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్‌ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్‌ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్‌ ‘తైవాన్‌ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది.  

మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్‌ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement