బీజింగ్: వచ్చే ఏడాది నవంబర్‌లో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సమాఖ్య(అపెక్) దేశాల నేతల శిఖరాగ్రానికి షెన్‌జెన్ వేదిక కానుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు. శనివారం ఆయన దక్షిణ కొరియాలోని గియాంగ్జులో జరుగుతున్న అపెక్ సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ మేరకు అపెక్ దేశాలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి.
పసిఫిక్ తీరంలో ఒకప్పుడు చేపల వేటకు మాత్రమే పరిమితమైన షెన్‌జెన్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయ స్థాయి నగరంగా మారిందని జిన్‌పింగ్ అన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని బలోపేతం చేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. సవాళ్లను ఎదుర్కొంటూ సుస్థిరమైన, సంపద్వంతమైన భవిష్యత్తును సృష్టించాలి’అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.


