
అమెరికా టారిఫ్ సవాళ్ల వేళ రష్యా, చైనా దేశాధినేతల కీలక భేటీ
బీజింగ్‌లో పుతిన్, జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు
రష్యా పర్యాటకులకు 30 రోజుల వీసారహిత సదుపాయం కల్పిస్తామన్న చైనా
చైనాలో మరో సహజవాయు పైప్‌లైన్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న రష్యా
బీజింగ్: అమెరికా విసిరిన టారిఫ్‌ల సవాళ్లతో ఇక్కట్లు ఎదురవుతున్న వేళ చైనా, రష్యా తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత బలపరుచుకుంటు న్నాయి. చైనాలోని తియాంజిన్‌లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు జరిగిన మర్నాడే ఇరు దేశాలు మంగళవారం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు చేపట్టాయి. పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చర్చల కోసం రాజధాని బీజింగ్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సాదర స్వాగతం పలికారు.
పుతిన్‌ను ‘చిరకాల మిత్రుని’గా అభివర్ణించారు. పుతిన్ సైతం తన ప్రసంగంలో జిన్‌పింగ్‌ను ప్రియ స్నేహితునిగా సంబోధించారు. ‘నాడు మేము కలిసే ఉన్నాం.. ఇప్పుడు కూడా కలిసే ఉంటాం’అని పుతిన్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాధినేతల లాంఛన సమావేశం అనంతరం చైనా అధికార కేంద్ర స్థానమైన ఝోంగన్‌హాయ్‌లో ఇరుపక్షాల ఉన్నతాధికారుల మధ్య తేనీటి విందు భేటీ జరిగింది.
రష్యా పర్యాటకులకు ఈ నెల నుంచి 30 రోజులపాటు వీసారహిత సదుపాయం కల్పించనున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే చైనాకు మరో సహజవాయు పైప్‌లైన్‌ను నిర్మించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు రష్యా ప్రభుత్వరంగ చమురు సంస్థ గాజ్‌ప్రోం సీఈఓ అలెక్సీ మిల్లర్ తెలిపారు. ప్రస్తుత పైప్‌లైన్ మార్గాల ద్వారా సహజవాయు సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.