న్యాయవ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ

Chief Justice NV Ramana On Judiciary Parties Wrongly Believe - Sakshi

సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ 

శాన్‌ఫ్రాన్సిస్కోలో భారతీయ అమెరికన్ల సంఘం సన్మానం

సాక్షి, న్యూఢిల్లీ/శాన్‌ఫ్రాన్సిస్కో: భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ ప్రతి చర్యకు న్యాయపరమైన ఆమోదం లభిస్తుందని భావిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రాజకీయ అవసరాలను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాయన్నారు. కానీ, భారత న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి.. కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్నా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతలను, వాటి పాత్రను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారంటూ జస్టిస్‌ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై సరైన అవగాహన లేకుంటే ప్రజలు సరైన దిశగా ఆలోచించలేరని చెప్పారు. ప్రజల్లోని ఈ అజ్ఞానమే న్యాయవ్యవస్థ స్వతంత్రను నాశనం చేయడమే ఏకైక లక్ష్యంగా ఉన్న కొన్ని శక్తులకు సహాయకారిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌ శుక్రవారం రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడారు.

‘దేశంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో తమ బాధ్యతను అద్భుతంగా నెరవేర్చారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లు సైతం ఇందులో చురుగ్గా వ్యవహరించారు’అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతుంటాయని, కానీ పరిణతి గల ఏ ప్రభుత్వమూ తన సొంత దేశం పురోగతిని దెబ్బతీసేలా విధానాలను మార్చబోదని సీజేఐ తెలిపారు. దురదృష్టవశాత్తూ భారత్‌లో మాత్రం ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలాంటి సున్నితత్వం, పరిపక్వత కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతీ ఒక్కరు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top