
భారతీయ విద్యార్థులకు గడ్డుకాలం
ఈ ఏడాది 80 శాతం వీసా దరఖాస్తుల తిరస్కరణ
నిబంధనలను కఠినంగా మార్చిన కెనడా ప్రభుత్వం
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు అమితంగా ఆసక్తి చూపుతుంటారు. అయితే, వారి ఆశలను కెనడా ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 80 శాతం ఇండియన్ స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించింది. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా(ఐఆర్‌సీసీ) ఈ విషయం స్వయంగా వెల్లడించింది.
భారతీయ విద్యార్థులే ఎక్కువగా ప్రభావితం అయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆసియాతోపాటు ఆఫ్రికా దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు అధికంగా తిరస్కరణకు గురయ్యాయి. వీసాలు సులభంగా లభించే పరిస్థితి లేకపోవడంతో కెనడా విద్యాసంస్థల్లో విదేశీయుల ప్రవేశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2024లో 1.88 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో చేరారు.
రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 3.60 లక్షలకు పైగానే ఉండేది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీపై దృష్టి పెడుతున్నారు. 2022లో కెనడాకు ప్రాధాన్యం ఇచ్చిన భారతీయుల విద్యార్థులు 18 శాతం ఉండగా, 2024లో అది 9 శాతానికి పడిపోయింది. జర్మనీకి వైపు ఆసక్తి చూపినవారి సంఖ్య గత ఏడాది 31 శాతంగా ఉంది.
ఎందుకీ పరిస్థితి?
అమెరికాలో విదేశీ విద్యార్థులపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థి వీసా నిబంధలను ప్రభుత్వం కఠినంగా మార్చింది. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధించింది. కెనడా సర్కార్ సైతం ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇళ్ల కొరత వేధిస్తోంది. మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీయుల రాకను అడ్డుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
స్థానిక రాజకీయాలకు ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విదేశీ విద్యార్థులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఆర్థిక వనరులు బలీయంగా ఉన్న విద్యార్థులకే కెనడా వీసాలు లభించే అవకాశం ఉంది. లాంగ్వేజ్ టెస్టులోనూ మంచి ప్రతిభ చూపాల్సి ఉంటుంది. సమగ్రమైన స్టడీ ప్లాన్ సమర్పించాలి. అంతేకాకుండా రూల్స్ ఆఫ్ వర్క్‌ను సైతం కఠినంగా మార్చారు. చదువుకుంటూ ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేయడం ఇక కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.
గమ్యస్థానం జర్మనీ
ఈ ఏడాది విదేశీ విద్యార్థులకు 4,37,000 వీసాలు ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కంటే 10 శాతం తక్కువ కావడం విశేషం. ఇందులో 73,000 వీసాలు పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులకు, 2,43,000 వీసాలు అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్దేశించారు. 1,20,000 వీసాలు రెన్యూవల్స్, పాఠశాల విద్యార్థులకు సంబంధించినవి. కెనడా వీసా చాలా ఖరీదైన అంశంగా మారిపోయింది. దరఖాస్తు, టెస్టులు, ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. ఒకసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ దరఖాస్తు చేసుకోలేక చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.
మొత్తానికి కెనడా కలలు చెదిరిపోతున్నాయి. మరోవైపు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి మనుగడ సాగించే కెనడా కాలేజీలు, యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని ఇతర కాలేజీల్లో విలీనమయ్యాయి. ఇదిలా ఉండగా, కెనడాకు ద్వారాలు మూసుకుపోతుండడంతో జర్మనీ విద్యాసంస్థల్లో చేరే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 2023లో 49,500 మంది చేరారు. 2025లో ఇప్పటికే 60,000 మంది ప్రవేశాలు పొందారు. జర్మనీలో టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ తదితర కీలక విభాగాల్లో తక్కువ ఫీజులకే మెరుగైన విద్య లభిస్తోంది. అమెరికా, కెనడాతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కూడా చాలా తక్కువ. ఈ అంశాలే జర్మనీని ఉన్నత విద్యకు గమస్థానంగా మారుస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్