రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు | bridge collapse Bryansk region Train Accident in Russia | Sakshi
Sakshi News home page

రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు

Jun 1 2025 7:44 AM | Updated on Jun 1 2025 11:25 AM

bridge collapse Bryansk region Train Accident in Russia

మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్‌ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్‌ కూడా ఉన్నారు. ప్యాసింజర్‌ రైలు మాస్కో నుండి క్లిమోవ్‌కు వెళుతోందని అన్నారు.

అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్‌ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్‌ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement