ఆ తార అస్తమయం వెనక...! | Sakshi
Sakshi News home page

ఆ తార అస్తమయం వెనక...!

Published Sat, Oct 7 2023 5:17 AM

Astronomers Observe Remnants of a Failed Supernova Using the James Webb Space Telescope - Sakshi

అది 2009. అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టుండి మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమీ కాదు. అరుదు అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్‌ నోవాగా పిలిచే బ్రహా్మండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి.

కానీ... సూర్యుని కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన ఎన్‌6946– బీహెచ్‌1 అనే నక్షత్రం మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఉన్నపళంగా మాయమైపోయింది!   మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు, మరో సూపర్‌ నోవా చోటు చేసుకోనుందనే అనుకున్నారు. కానీ జరగకపోగా, అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణాలపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది.

కృష్ణబిలం మింగింది.. కాదు...
ఈ తార విచిత్ర అంతర్ధానాన్ని ’జరగని సూపర్‌ నోవా’గా అప్పట్లో కొందరు సైంటిస్టులు పిలిచారు. బహుశా ఆ నక్షత్రాన్ని ఏదో కృష్ణబిలం మింగేసిందని వారు ప్రతిపాదించారు. అలా అది కూడా కృష్ణబిలంగానే మారిందని సూత్రీకరించారు. ఆ ఉద్దేశంతోనే దాని పేరు చివరన బీహెచ్‌1 అని చేర్చారు. అయితే అది సరికాదని మరికొందరు సైంటిస్టులు తాజాగా వాదిస్తున్నారు. దీనికి సంబంధించి జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ఇటీవల సేకరించిన పరిణామాల్ని విశ్లేíÙంచిన మీదట ఆ వాదనకు బలం చేకూరుతోంది.

బీహెచ్‌1 తార ఉన్న చోట అతి ప్రకాశవంతమైన పరారుణ కాంతిని జేమ్స్‌ వెబ్‌ గమనించింది. అది మూడు వేర్వేరు రకాల కాంతి అని కూడా చెబుతున్నారు. బహుశా పలు నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి పెను తారగా మారాయనేందుకు ఇది నిదర్శనమని అంటున్నారు. కానీ సూపర్‌ నోవాగా మారకుండా అది ఎలా అంతర్ధానం అయిందన్న కీలక ప్రశ్నకు మాత్రం ఇంకా బదులు దొరకాల్సే ఉంది!  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement