
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోమారు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అసిమ్ మునీర్ రెండు నెలల్లో రెండవసారి అమెరికాను సందర్శిస్తున్నారు. ఇస్లామాబాద్- వాషింగ్టన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయనడానికి ఈ పర్యటన సూచికగా నిలిచింది.
సుంకాల విషయంలో అమెరికా-భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్‌తో ట్రంప్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్నందుకు శిక్షగా ట్రంప్ భారత్ ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా చమురును కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా ఇలాంటి చర్యలే ఉంటాయని హెచ్చరించారు.
కాగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ గత జూన్‌లో వాషింగ్టన్‌ను సందర్శించారు. ట్రంప్ ఆ సమయంలో అతనికి వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. అప్పట్లో పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్.. మునీర్ మరోమారు ఈ ఏడాది చివర్లో అమెరికాను సందర్శిస్తారని పేర్కొంది. కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన అనంతరం భారతదేశం తన ప్రతిదాడిని ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో చూపింది.
ఈ నేపధ్యంలో నాటి నుంచి భారత్- అమెరికా మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొంది.. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. ఆపరేషన్ సిందూర్‌ను ఆపివేయాలని ప్రపంచంలో ఏ దేశాధి నేతలూ తమను అడగలేదని ప్రధాని మోదీ పార్లమెంటులో పేర్కొన్నారు.