
లండన్‌లో పోలీసులతో నిరసనకారుల ఘర్షణ
నీళ్ల సీసాలు, చేతికందిన వస్తువులతో దాడి
26 మంది పోలీసులకు గాయాలు 24 మంది నిరసనకారుల అరెస్టు
లండన్: వలసదారులకు వ్యతిరేకంగా యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) రాజధాని లండన్‌లో చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. విదేశీయులను బయటకు పంపించాలన్న డిమాండ్‌తో అతివాద నేత టామీ రాబిన్సన్ పిలుపు మేరకు శనివారం జరిగిన ర్యాలీలో ఏకంగా 1,50,000 మంది పాల్గొన్నారు. ‘యునైట్ ద కింగ్‌డమ్ ర్యాలీ’ పేరిట సెంట్రల్ లండన్‌లో కదం తొక్కారు. పార్లమెంట్ సమీపంలోనే భారీ ప్రదర్శన నిర్వహించారు.
అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారుల దాడిలో 26 మంది పోలీసులు గాయపడినట్లు మెట్రోపాలిటన్ పోలీసు విభాగం అధికారులు తెలిపారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. పోలీసులపై నిరసనకారులు నీళ్ల సీసాలతోపాటు చేతికందిన వస్తువులు విసిరేశారని, దూరంగా నెట్టేయడానికి ప్రయతి్నంచారని పేర్కొన్నారు.
హింస ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, లండన్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించిన 24 మందిని అరెస్టుచేశారు. వారిపై వివిధ అభియోగాలు నమోదు చేశారు. 25 మందిని అరెస్టు చేసినట్లు తొలుత ప్రకటించగా, ఆదివారం ఆ సంఖ్యను 24గా సవరించారు. నిరసన తెలపడం చట్టబద్ధమైన హక్కు అయినప్పటికీ కొందరు హింసకు పాల్పడాలన్న ఉద్దేశంతో ర్యాలీలో పాల్గొన్నారని ఓ పోలీసు అధికారి చెప్పారు.
పోలీసులపై జరిగిన దాడిని హోం సెక్రెటరీ షబానా మహమూద్ ఖండించారు. చట్టాన్ని ఉల్లంఘించివారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. మరోవైపు జాత్యహంకారానికి వ్యతిరేకంగా లండన్‌లో మరో ర్యాలీ సైతం జరిగింది. ‘స్టాండ్ అప్ టు రేసిజం’ పేరిట జరిగిన ఈ ర్యాలీలో 5,000 మందికిపైగా జనం పాల్గొన్నారు. వలసదారులను వ్యతిరేకించడం, వారిపై కక్షగట్టడం సరైంది కాదంటూ నినదించారు.
వలసల వల్ల విధ్వంసమే: ఎలాన్ మస్క్
లండన్‌లో నిర్వహించిన యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీని టెస్లా సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సమరి్థంచారు. వలసదారులను వ్యతిరేకించేవారికి పూర్తి మద్దతు ప్రకటించారు. నిరసనకారులను ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. నియంత్రణ లేని వలసల వల్ల దేశానికి భారీ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. యూకేలో ప్రభుత్వాన్ని మార్చేసే దిశగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పార్లమెంట్‌ను రద్దుచేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మితిమీరిన వలసల కారణంగా దేశం విధ్వంసం అంచున ఉన్నట్లు హెచ్చరించారు. ఇప్పుడున్నవి రెండే మార్గాలని తేల్చిచెప్పాలి. పోరాటం చేయాలని, లేదంటే చచ్చిపోయే పరిస్థితి వస్తుందని స్పష్టంచేశారు. పోరాటమా? మరణమా? ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్పును తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎందుకీ నిరసనలు?
యూకేలో వలసదారుల పట్ల స్థానికుల్లో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. లండన్ శివారులో ఇటీవల 14 ఏళ్ల బాలిక లైంగిక దాడికి గురైంది. ఇథియోపియా నుంచి వలసవచ్చిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. దాంతో వలసదారులకు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఇమ్మిగ్రెంట్లు తలదాచుకుంటున్న ఇళ్లు, హోటళ్లను జనం ముట్టడించారు. వలసదారుల కారణంగా ఇంగ్లండ్ సంస్కృతి నాశనమవుతోందని జనం మండిపడుతున్నారు. తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తచేస్తున్నారు. మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పడుతోందని అంటున్నారు. వలసదారులను వారి స్వదేశాలకు పంపించాలని పట్టుబడుతున్నారు. అవకాశాలు స్థానికులకే దక్కాలని అంటున్నారు.
నిరసనలకు లొంగేది లేదు: స్టార్మర్
వలసలదారుల వ్యతిరేక నిరసనలకు బ్రిటన్ ఎప్పటికీ తలవంచబోదని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం స్పష్టంచేశారు. లండన్‌లో జరిగిన హింసను ఖండించారు. జాతీయ జెండాను ముసుగుగా కప్పుకొని హింసాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎరుపు, తెలుపు ఇంగ్లిష్ జెండా దేశ వైవిధ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. చర్మం రంగు లేదా నేపథ్యం ఆధారంగా పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని, వారిని వ్యతిరేకించడాన్ని సహించబోమని స్టార్మర్ హెచ్చరించారు.