వాషింగ్టన్ డీసీ: అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదంలో పెళ్లికొడుకు దుర్మరణం చెందాడు. పెళ్లికూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులిద్దరూ భారత సంతతికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది.
కేరళకు చెందిన డేవ్ ఫిజీ, జెస్నీలు అట్లాంటాలో స్థిరపడ్డారు. జార్జియాలోని డాసన్ కౌంటీలో వీరి వివాహం వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుక అనంతరం ఈ కొత్త జంట 'రాబిన్సన్ R66' రకం హెలికాప్టర్‌లో సరదాగా బయలుదేరారు. అయితే, డాసన్‌విల్లేలోని 24 మౌంట్ వెర్నాన్ డ్రైవ్ సమీపంలోకి రాగానే ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో పెళ్లికొడుకుతో పాటు ఫైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, పెళ్లికూతురుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రమాద వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో దంపతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణం కావచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు.


