
ఇస్లామాబాద్: భారత పార్లమెంట్‌పై దాడి(2001), 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మే 6న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సమయంలో క్షిపణి దాడి కారణంగా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అత్యంత సన్నిహితుడని సమాచారం.
అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు నిధులను అందించే అగ్రశ్రేణి నిర్వాహకుడు. సోషల్ మీడియాలో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు పత్యక్షమయ్యాయి. వీటిలో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, అబ్దుర్ రవూఫ్ తదితర సీనియర్ లష్కర్ నేతలు ఆయన మరణానికి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తోంది. అజీజ్ గతంలో గల్ఫ్ దేశాలతో పాటు యూకే, యూఎస్‌లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు, పాకిస్తాన్ కమ్యూనిటీల నుండి నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, నియామకాలను అజీజ్ చేపట్టాడని తెలుస్తోంది.
అతని మృతి లష్కర్ ఎ తోయిబాకు తీరని లోటుగా ఉగ్రవాదనేతలు భావిస్తున్నారు. అబ్దుల్ అజీజ్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉంది. 2001 పార్లమెంట్ దాడికి పాకిస్తాన్ నుండి డబ్బు, పరికరాలను తరలించడంలో సహాయం చేశాడని నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. 2006 ముంబై లోకల్ రైలు పేలుళ్లకు కూడా ఇతను ఆర్థిక సహాయం అందించాడని భావిస్తున్నారు. 2008 ముంబై దాడుల సమయంలో, అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్‌లను అందజేసినట్లు తెలుస్తోంది.