హార్మూజ్‌పై బ్రిటన్‌ సమావేశం  | 40 countries discussed joint action to reopen the Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌పై బ్రిటన్‌ సమావేశం 

Apr 3 2026 5:21 AM | Updated on Apr 3 2026 5:21 AM

40 countries discussed joint action to reopen the Strait of Hormuz

40కి పైగా దేశాలతో వర్చువల్‌ భేటీ 

భారత్‌ తరఫున హాజరైన విదేశాంగ కార్యదర్శి మిస్రీ

లండన్‌: అంతర్జాతీయ నౌకాయాన రంగంలో కీలకమైన హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ ఏకపక్షంగా గుత్తాధిపత్యం సాధించి నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై బ్రిటన్‌ కన్నెర్రజేసింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గళం విప్పేందుకు, దేశాల మధ్య ఐక్యత సాధించేందుకు బ్రిటన్‌ నడుంబిగించింది. ఇందులోభాగంగా గురువారం ఏకంగా 40కిపైగా దేశాలతో వర్చువల్‌ భేటీని నిర్వహించింది. 

ఈ సమావేశంలో భారత్‌ తరఫున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ హాజరయ్యారు. భేటీలో బ్రిటన్‌ విదేశాంగ శాఖ మహిళా కార్యదర్శి యూవెట్టీ కూపర్‌ ఇరాన్‌పై నిప్పులు చెరిగారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించే దురుద్దేశంతో ఇరాన్‌ హార్మూజ్‌ను గుప్పిటపట్టింది. దానిని ఎలాగైనా మనం తెరిపించాల్సిందే. గల్ఫ్‌ ప్రాంతం గుండా నౌకాయానానికి మార్గం సుగమం చేసేందుకు సమష్టిగా పోరాడేందుకు ఈ భేటీని ఒక వేదికగా మార్చుకుందాం.

 ఇరాన్‌పై దౌత్య, రాజకీయ మార్గాల్లో తీవ్రంగా ఒత్తిడి చేసి హార్మూజ్‌ను తెరిపిద్దాం. లేదంటే పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది’’అని కూపర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. సైనికచర్య ద్వారా హార్మూజ్‌ను తెరవొచ్చని అమెరికా భావించడం అసంబద్దంగా ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ వ్యాఖ్యానించారు. ‘‘హార్మూజ్‌ ద్వారా స్వేచ్ఛా వాణిజ్యానికి భారత్‌ మొదట్నుంచీ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హార్మూజ్‌ గుండా వాణిజ్యం మొదలుకావాలి’’అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ వ్యాఖ్యానించారు. బిటన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, కెనడా, జపాన్, యూఏఈ తదితర 40కిపైగా దేశాలు ఈ భేటీలో పాల్గొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement