
32 మంది మృత్యువాత
గాజా సిటీ: గాజా నగరం వీడి వెళ్లిపోవాలంటూ పౌరులకు ఓ వైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. తాజా దాడుల్లో కనీసం 32 మంది చనిపోయారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దాడులు కొనసాగాయి. షేక్ రద్వాన్ ప్రాంతంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు సహా కుటుంబంలోని 10 మంది మృత్యువాతపడ్డారు.
ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం సోషల్ మీడియా వేదికలపై మరోసారి పాలస్తీనియన్లకు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్ శ్రేణులు నిఘాకు వాడుకుంటున్నాయనే సాకుతో గాజా నగరంలోని సుమారు వంద బహుళ అంతస్తులను ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో నేలమట్టం చేయడం తెల్సిందే. తక్షణమే గాజా నగరాన్ని వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని అందులో అల్టిమేటం జారీ చేసింది. అయితే, చాలా మంది ఎక్కడికి వెళ్లే పరిస్థితుల్లో లేరు.
అధిక రవాణా ఖర్చులు, నివాస సమస్య తీవ్రంగా ఉంది. దీంతోపాటు ఇప్పటికే పలుమార్లు ఒక చోటు నుంచి మరోచోటుకు మారుతూ వస్తున్న వారు సైతం గాజాలో ఎక్కడికి వెళ్లినా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు తప్పవనే నిస్పృహతో ఉండటం కారణాలుగా ఉన్నాయి. గాజా నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 లక్షల మందిలో ఇప్పటివరకు 2.5 లక్షల మంది దక్షిణాదిన ఏర్పాటు చేసిన మానవతా జోన్‌వైపు వెళ్లినట్లు ఆర్మీ ప్రతినిధి అవిచయ్ అడ్రీ అంటున్నారు.
గాజా ప్రజలకు తాత్కాలికంగా నీడ కల్పించేందుకు ఉద్దేశించిన 86 వేల టెంట్లు, ఇతర సరఫరాలను ఇజ్రాయెల్ ఆర్మీ లోపలికి అనుమతించడం లేదని ఐరాస తెలిపింది. నెలలుగా కొనసాగుతున్న దిగ్బంధం కారణంగా 24 గంటల వ్యవధిలో పోషకాహార లోపంతో ఏడుగురు చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. దీంతో, యుద్ధం మొదలయ్యాక పోషకాహార లోపం సంబంధ కారణాలతో చనిపోయిన వారి సంఖ్య 420కి చేరుకోగా, వీరిలో 145 మంది చిన్నారులే ఉన్నారని వివరించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సాగించిన దాడుల్లో ఇప్పటివరకు 64,803 మంది చనిపోయారని గాజా ఆరోగ్య విభాగం పేర్కొంది. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనంది.