తేమంటలు | - | Sakshi
Sakshi News home page

తేమంటలు

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

ఉష్ణ తీవ్రత కంటే తేమ శాతంతోనే ఉక్కపోత

సాక్షి, సిటీబ్యూరో

గాలిలో తేమశాతం పెరిగితే.. అది ఉష్ణ తీవ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపనుందా? ఉక్కపోతకు అసలు ప్రధాన కారణం తేమ శాతమేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో గాలిలో పెరుగుతున్న తేమశాతంతో అసలు ఉష్ణోగ్రతల కంటే మన శరీరానికి తగిలే వేడి 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉంటోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణతాపానికి ‘ఉక్కపోత’ భరించలేని స్థాయికి చేరుకుంది. బుధవారం గరిష్టంగా 40.6, కనిష్టంగా 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజులుగా గరిష్ట 40 డిగ్రీల వరకు నమోదవుతున్నప్పటికీ.. పెరిగిన తేమశాతం కారణంగా అది 45 డిగ్రీల పైన ఉన్నట్లు ప్రభావం చూపుతోంది. చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడటం లేదు. దీంతో నగర వాసులు నీరసం, విపరీతమైన ఉక్కపోతకు గురవుతున్నారు. గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే నగరంలో ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు ’ఉక్కపోత’ రికార్డు స్థాయిలో 60 నుంచి 70 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగడానికి సూర్యరశ్మి మాత్రమే కారణం కాదని, మానవ నిర్మితాలే ప్రధానమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పచ్చదనం కరువై..

వాస్తవంగా నగరం వేగంగా విస్తరించడంతో పచ్చదనం కరువైంది. ఎత్తయిన భవనాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రివేళల్లో ఆ వేడిని వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. దీంతో రాత్రిపూట కూడా ఉపశమనం లభించడం లేదు. మరోవైపు పెరిగిన వాహనాల సంఖ్యతో విడుదలయ్యే కార్బన్‌ డయాకై ్సడ్‌ వంటి వాయువులు వేడిని వాతావరణంలోనే బంధిస్తున్నాయి. గదుల లోపల చల్లదనం కోసం వాడే ఏసీలు, బయట వాతావరణంలోకి భారీగా వేడి గాలిని విడుదల చేస్తున్నాయి. ఇది చుట్టుపక్కల ప్రాంతాలను మరింత వేడెక్కిస్తోంది.

ఉక్కపోత ఇలా..

మానవ శరీరం అనుభవించే అసలైన వేడిని రెండు పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు. హీట్‌ ఇండెక్స్‌ అంటే అనిపించే ఉష్ణోగ్రత (అప్పరెంట్‌ టెంపరేచర్‌) అని కూడా అంటారు. గాలి ఉష్ణోగ్రత, గాలిలోని సాపేక్ష ఆర్ద్రత (రిలేటివ్‌ హ్యూమిడిటీ) రెండింటినీ కలిపి దీనిని లెక్కిస్తారు. ఉదాహరణకు బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉండి తేమ 60 శాతం ఉంటే హీట్‌ ఇండెక్స్‌ ప్రకారం మన శరీరానికి అది 47 డిగ్రీలుగా అనిపిస్తుంది.

గాలిలో తేమశాతం ఇలా ఉంటే..

ఉష్ణోగ్రతల కంటే హీట్‌ ఇండెక్స్‌ అధికం

అదనంగా 4 నుంచి 5 డిగ్రీల ఎక్కువ వేడి

చెమట పట్టినా అది గాలిలోకి ఆవిరి కాని వైనం

కాంక్రీట్‌ జంగిల్‌ ప్రభావం

నిప్పుల కొలిమిని తలపిస్తున్న మహానగరం

నగరంలో బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)

ప్రాంతం గరిష్టం కనిష్టం

హైదరాబాద్‌ 40.6 27.4

హకీంపేట 40.8 25.2

దుండిగల్‌ 40.6 26.1

హయత్‌నగర్‌ 40.0 24.6

రాజేంద్రనగర్‌ 40.0 23.5

పటాన్‌చెరు 39.4 23.0

Advertisement
 
Advertisement
Advertisement