● తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
గన్‌ఫౌండ్రీ: క్రీడల్లో వివక్షకు చోటు లేకుండా దివ్యాంగులు, బధిరుల క్రీడలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో 27వ జాతీయ సీనియర్ డెఫ్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన బ్యాడ్మింటన్ విజేతలను సన్మానించారు. ఇటీవల చండీఘఢ్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఆఫ్ డెఫ్ అండ్ డంబ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చారు. బ్యాడ్మింటన్ విభాగంలో బి.గోపి అండర్–18 కేటగిరీలో రజత, కాంస్య పతకాలు సాధించగా, అండర్–16 విభాగంలో హాసిని రెడ్డి స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు.
జీతాలు మీరే చెల్లించండి
● ప్రభుత్వాన్ని కోరనున్న కమిషనర్లు !
సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ లోని మూడు కార్పొరేషన్లలో సీఎంసీ పరిస్థితి ఓ మేరకు బాగున్నా, మిగతా రెండు కార్పొరేషన్ల పరిస్థితి దారుణంగా మారింది. ఇక, అన్ని కార్పొరేషన్లకూ మాతృక అయిన జీహెచ్‌ఎంసీ నెత్తిన వేల కోట్ల అప్పుల భారం ఉంది. ఆ అప్పులు తాము చెల్లించలేమని, ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి వివిధ రూపాల్లో నిధులు రావాల్సి ఉన్నందున వాటిని జీహెచ్‌ఎంసీకి ఇచ్చే బదులు వాటితో జీహెచ్‌ఎంసీ అప్పులు చెల్లించాలని ఇప్పటికే కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు మూడు కార్పొరేషన్లకు ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తికాలేదు. ఇదిలా ఉండగా, కార్పొరేషన్ల విభజనతో జీహెచ్‌ఎంసీకి ఆదాయం వచ్చే సర్కిళ్లు తక్కువ..పనులు చేయాల్సిన సర్కిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎంఎంసీ పరిస్థితి మరోలా ఉంది. ఉన్న మూడు కార్పొరేషన్లలో అత్యల్ప ఆదాయం ఉన్నది దానికే. ఏరియా ఎక్కువే ఉంది. చేయాల్సిన పనులు, కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చేసినా చేయకున్నా సిబ్బంది జీతాలు చెల్లింపులు తప్పవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగతా స్థానిక సంస్థల మాదిరిగానే మూడు కార్పొరేషన్లలోని సిబ్బందికి కూడా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. గతంలో జీహెచ్‌ఎంసీకి ఎక్కువ ఆదాయం ఉన్నందున సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించేది. అదే విధానం కొనసాగుతోంది. అంతే కాదు, వివిధ ప్రాజెక్టులు కూడా పూర్తిచేసింది. కానీ..ప్రస్తుతం పరిస్థితి మారడంతో సిబ్బంది జీతాలు ప్రభుత్వమేచెల్లిస్తే మేలని కమిషనర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.


