గచ్చిబౌలి: భార్యను హత్య చేసిన ఓ భర్త రిమాండ్ నుంచి వచ్చిన మూడు రోజులకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బావమరిదికి లొకేషన్ షేర్ చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ జగదీష్ తెలిపిన మేరకు.. ప్రకాశం జిల్లా కొరిదెనకు చెందిన రారాజు(33) ఇసుక, ఇటుక వ్యాపారం చేస్తున్నాడు. భార్య విజయ లక్ష్మీతో కలిసి మియాపూర్ పీఎస్ పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో నివాసం ఉండేవారు. కుటంబ కలహాల నేపథ్యంలో రారాజు మద్యానికి బానిసగా మారి తరచూ భార్యతో గొడవపడేవాడు. గత డిసెంబర్ 23న గొడవ జరగడంతో విజయ లక్ష్మీ మెడ పట్టుకొని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. విజయ లక్ష్మీ స్పృహతప్పి పడిపోవడంతో కేపీహెచ్‌బీలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. భార్య హత్య కేసులో రిమాండ్‌కు తరలించడంతో కంది జైలులో ఉన్నాడు. బెయిల్‌పై మార్చి 29న జైలు నుంచి విడుదల అయ్యాడు. భార్యను హత్య చేసిన ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన రారాజు గురువారం సాయంత్రం బావమరిది శ్రీనివాస్ రావుకు ఫోన్ చేసి మీ నాన్న శివరావును తీసుకొని రావాలని ఫొటోలు, లొకేషన్ షేర్‌చేశాడు. నానక్‌రాంగూడ రోటరీ సమీపంలోని శ్మశానవాటికలో వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించడంతో మృత దేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బావమరిదికి లొకేషన్ షేర్ చేసి బలవన్మరణం రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు


