
గుండెపోటుతో రచయిత వెంకట్‌గౌడ్ మృతి
గాంధీ కళాశాలకు భౌతికకాయం అప్పగింత
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ (52) గురువారం ఉదయం గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ విద్యానగర్‌లో మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన వెంకట్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రతోపాటు తెలంగాణ అస్థిత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై పలు రచనలు చేశారు. మృతుని కోరిక మేరకు కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఆయన నేత్రాలు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు సేకరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మెడికల్ జేఏసీ కన్వీనర్ వేణుగోపాల్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు రామారావు గౌడ్, సత్యంగౌడ్, గౌడ జేఏసీ చైర్మన్ అంబాల నారాయణగౌడ్, ముద్దగోని రాంమోహన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ తొడపనూరి సత్యగౌడ్, బూర వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.
‘వెంకట్‌గౌడ్ మృతి తెలంగాణకు తీరని లోటు’
తెలంగాణ వాది, ప్రముఖ రచయిత కొంపల్లి వెంకట్‌గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అసామాన్యమని, రచనల ద్వారా బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తన సాహిత్య జీవితాన్ని సాగించారని అన్నారు.