
సైబర్ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్స్
రిపీటెడ్ అఫెండర్లపై తెరవాలని నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా ఈ తరహా నేరగాళ్లను కట్టడి చేసేందుకు సిటీ పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదే పదే ఈ నేరాలు పాల్పడే వారిపై సస్పెక్ట్ షీట్స్ తెరవనున్నారు. ఈ మేరకు ఈ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉన్న ఏసీపీ అందరూ ఇన్‌స్పెక్టర్లు, సబ్–ఇన్‌స్పెక్టర్లకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కేటుగాళ్లపై నిరంతర నిఘా ఉంచడానికి, వారి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సిటీలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో పట్టుబడుతున్న నిందితుల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువ. ఈ నేపథ్యంలో సస్పెక్ట్ షీట్స్ లక్ష్యం ఎంత వరకు నెరవేరుతుందనేది వేచి చూడాల్సిందే.
బీఎన్‌ఎస్ అమలులోకి రావడంతో..
రౌడీలపై రౌడీషీట్, చోరులపై సిటీ డోషియర్ క్రిమినల్ (సీడీసీ) షీట్, సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలు చేసిన వారిపై కమ్యూనల్ షీట్, భూ కబ్జాకోరులపై లాండ్ గ్రాబర్ షీట్ తెరవడం ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీసు మాన్యువల్‌లో అవకాశం ఉంది. నిర్ణీత కాలంలో ఒకటి కంటే ఎక్కువ నేరాలు చేసే రిపీటెడ్ అఫెండర్లపై వీటిని తెరుస్తారు. అయితే సైబర్ నేరాలు చేసే వారిలోనూ అనేక మంది రిపీటెడ్ అఫెండర్లు ఉంటున్నారు. ఒకరే అనేక నేరాలు చేస్తుండగా... పదేపదే చేస్తున్న వాళ్లూ ఉంటున్నారు. వీరి పైనా సస్పెక్ట్ షీట్స్ తెరిచే అవకాశం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు దక్కింది. దీంతో పదేపదే, అనేక నేరాలు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పైనా సస్పెక్ట్ షీట్స్‌ను తెరవనున్నారు.
పటిష్ట నిఘా, పర్యవేక్షణకు అవకాశం...
ఇప్పటి వరకు అసాంఘిక శక్తులపై చట్ట పరిధిలో తెరుస్తున్న షీట్స్‌లో స్వల్ప మార్పులతో సైబర్ క్రైమ్ అధికారులు ఈ సస్పెక్ట్ షీట్లు నమోదు చేయనున్నారు. వీటిలో సదరు నేరగాడికి సంబంధించిన ఫొటో, చిరునామా, నమోదై ఉన్న కేసులు, నేరం చేసే విధానం సహా పూర్తి సమాచారం పొందుపరుస్తారు. ఈ వివరాలను తమ వద్ద ఉంచుకోవడంతో పాటు సదరు నేరగాళ్లు ఏ ఠాణా పరిధిలో నివసిస్తుంటే ఆ పోలీసు స్టేషన్‌కు పంపుతారు. ఆయా ఠాణాల్లో వీరి ఫొటోలను అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల ఆయా చోట్ల పోలీసు అధికారులు మారినప్పటికీ వీరిపై పక్కా నిఘా ఉంచడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. నేరగాడి చిరునామా మారినప్పుడల్లా ఈ షీట్‌ను ఆ పరిధిలోని ఠాణాకు పంపిస్తారు.
ఆ పోలీసులు సహకరిస్తారా..?
నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో అరెస్టు అవుతున్న నిందితుల్లో బయటి రాష్ట్రాల వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. తమ ప్రాంతాల్లో ఎలాంటి నేర చరిత్ర లేని వీరు బయటి ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై ఇక్కడ షీట్ తెరిచినా ఉపయోగం లేదు. దీన్ని పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటి నేరగాళ్లపై షీట్లు తెరవడంతో పాటు ఆ వివరాలను వారు నివసిస్తున్న ప్రాంతం ఏ జిల్లా పరిధిలోని వస్తుందో ఆ జిల్లా ఎస్పీలకు లేఖ ద్వారా నివేదించాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలో ఉన్న అనేక పోలీసు విభాగాలు నేరగాళ్లతో ములాఖత్ అయి ఉంటున్నాయి. ఈ కారణంగానే వాళ్లు ఎంత వరకు సమర్థంగా నిఘా ఉంచుతారు, ముందస్తు చర్యలు తీసుకుంటారన్నది పోలీసులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే...
ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న, సాధారణ, సోషల్‌మీడియా వేదికగా జరిగే సైబర్ నేరగాళ్లపై తెరిచిన సస్పెక్ట్ షీటర్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లలో ఉంచడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడం సాధ్యం కాదనే వాదన ఉంది. సామాన్యులు, మోసగాళ్ల ఎత్తులకు ఆకర్షితులవుతున్న వారు ఠాణాలకు వెళ్లి వివరాలు సరి చూసుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి వారి వివరాలను పోలీసు అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రత్యేక లింకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరూ ఇంటర్ నెట్ ద్వారా మోసాగాళ్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఈ షీట్లు తెరవాలనే నిర్ణయం వెనుక మరో కోణం ఉందని, సోషల్ మీడియా గొంతు నొక్కాలనే ప్రయత్నం ఉందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
అనునిత్యం నిఘా, పర్యవేక్షణ కోసం ఇలా
నేరగాళ్లలో బయటి రాష్ట్రాల వాళ్లే ఎక్కువ
షీట్లు తెరిచినా వారిపై చర్యలు సాధ్యం కాని అంశమే