
గల్ఫ్‌లో చిక్కుకున్న మా నాన్నను కాపాడండి
పంజగుట్ట: ఏజెంట్, తోటి ఉద్యోగుల చేతితో మోసపోయి గత రెండేళ్లుగా గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తన భర్తను ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ, రాంనగర్‌కు చెందిన అమీనా సౌఘాత్ అన్నారు. ఈ మేరకు ఆమె గురువారం తన నలుగురు పిల్లలతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు .. తన భర్త మొహమ్మద్ గౌస్ మిర్యాలగూడ పట్టణంలో ఆటో నడుపుకునే వాడని, 2023 మార్చ్ 21న దుబాయ్‌కు చెందిన సమీర్ అనే ఏజెంట్ ద్వారా రూ. 1.20 లక్షలు ఖర్చు పెట్టి దుబాయ్‌లోని యాక్షన్ ఇంటర్‌నేషనల్ సర్వీస్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగానికి వెళ్లినట్లు తెలిపింది. కొన్ని నెలల పాటు వారు అతడిని బాగానే చూసుకున్నారన్నారు. ఆ తర్వాత సమీర్ అతని వద్ద పనిచేసే విక్కి అలియాస్ హిమాన్షు, డ్రైవర్ అలి అనే ముగ్గురు వ్యక్తులు దుబాయ్‌లోని కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలని, బ్యాంక్ అకౌంట్, వసతి పేరుతో కొన్ని పత్రాలపై మొహమ్మద్ గౌస్‌తో సంతకాలు, పాస్‌పోర్టు, వీసా, ఇక్వామా తీసుకున్నారని తెలిపారు. సదరు డాక్యుమెంట్ల ఆధారంగా తన భర్త గౌస్ పేరుతో క్రెడిట్‌కార్డులు, పర్సనల్ లోన్లు తీసుకుని మోసం చేశారన్నారు. ఈ విషయం తన భర్త తనకు ఫోన్ చేసి చెప్పాడని గత 18 నెలలుగా అతను స్నేహితుల వద్ద తలదాచుకుని మసీదు వద్ద ఒకపూట భోజనం చేస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్‌పోర్టు, వీసా లేక ఎక్కడా పనిచేసుకోలేక బయటికి వెళ్లలేక ఇబ్బందులు పడుతుండటంతో తాము ఇప్పటివరకు రూ. 80 వేలు పంపించామని ఇక పంపే స్థోమత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తన భర్తను ఇండియాకు రప్పించేలా చూడాలని వేడుకున్నారు. సమావేశంలో మొహమ్మద్ గౌస్ తల్లి మొహమ్మద్ అఫ్జలున్నిసా బేగం, పిల్లలు అనీసా విసాల్, అర్షక్ వసీల్, అరూబా వాఫియా, ఆసిల్ వాఫిక్ తదితరులు పాల్గొన్నారు.