
సమష్టి పోరాటంతోనే సమస్యల పరిష్కారం
ముషీరాబాద్: నిరుద్యోగుల సమస్యలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతున్న అశోక్ అమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని కోరుతూ అశోక్ భార్య సునీత నిరుద్యోగులతో కలిసి విద్యానగర్ బీసీ భవన్‌లో ఆర్.కృష్ణయ్యను కలిశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై అశోక్ తెగించి కొట్లాడుతున్నారన్నారు. 12 రోజులుగా అమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అణిచివేస్తే భారీ మూల్యం తప్పదన్నారు. అశోక్‌కు ఏమి జరిగినా ప్రభుత్వనిదే బాధ్యతని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి వారి సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మూడేళ్లు ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆలోగా నిరుద్యోగ సమస్య లేకుండా చూడాలన్నారు. రాజకీయ కోణంలో కాకుండా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని ఆయన వెనుక నిరుద్యోగ యువత ఉందన్నారు. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అశోక్‌తో చర్చించి అమరణ నిరాహార దీక్షను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సొంత హాస్టల్స్ సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. జీవో నెంబర్ 29ని రద్దు చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నందునే అమరణ నిరాహార దీక్షకు అశోక్ దిగాడని 12 రోజులుగా ఒక్క మంత్రి కూడా దీనిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే అశోక్‌తో చర్చలు జరపాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గ్రూప్–1 అభ్యర్థి ఝాన్సీ రాణి మాట్లాడుతూ ఏడాది తిరిగేలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి దసరా లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నీలా వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య