మేఘ విస్ఫోటం | - | Sakshi
Sakshi News home page

మేఘ విస్ఫోటం

Sep 25 2025 1:30 PM | Updated on Sep 25 2025 1:30 PM

మేఘ విస్ఫోటం

మేఘ విస్ఫోటం

ఊహించని రీతిలో వర్షాలు

స్వల్ప వ్యవధిలో 10 సెంటీమీటర్ల పైనే

ఈ సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

నగరం నెత్తిన కుంభవృష్టి

సాక్షి, సిటీబ్యూరో

హా నగరాన్ని పక్షం రోజులుగా మేఘ విస్ఫోటం (క్లౌడ్‌ బరస్ట్‌) వెంటాడుతోంది. ఒక్కో రోజు.. ఒక్కో ప్రాంతంలో ఆకాశానికి చిల్లుపడినట్లు కుంభవృష్టి కురుస్తోంది. అతి స్వల్ప వ్యవధిలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. పగలంతా ఉష్ణతాపం ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా.. సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతమై కుండపోత బెంబేలెత్తిస్తోంది. పది రోజుల క్రితం అత్యధికంగా ముషీరాబాద్‌ తాళ్లబస్తీ ప్రాంతంలో అతి తక్కువ సమయంలో 18 సెంటీమీటర్లపైగా వర్షపాతం నమోదు కాగా.. అదేతరహా ప్రతి రోజూ 10 సెంటీమీటర్ల తగ్గకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆకస్మికంగా ఊహించని స్థాయిలో కురుస్తున్న వర్షంతో సిటీజనులు వణికిపోతున్నారు.

స్వల్ప సమయంలోనే..

అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారితీయడాన్నే మేఘాల విస్ఫోటంగా వాతావరణ శాఖ పరిగణిస్తోంది. కేవలం నిమిషాల వ్యవధిలో ఒక చిన్న భౌగోళిక ప్రాంతంలో సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్లలోపు అత్యధిక తీవ్రతతో భారీ వర్షం కురుస్తోంది. ఇది సాధారణ వర్షపాతం కన్నా చాలా వేగంగా, అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. ఇది ప్రధానంగా గంటల వ్యవధిలో కురిసే వర్షం కాదు, కేవలం నిమిషాల్లోనే మొత్తం వర్షం కురిసిపోతుంది. గంట వర్షపాతం పరిశీలిస్తే.. కనీసం 10 సెంటీమీటర్లు (100 మిల్లీమీటర్ల) లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో కురిసే భారీ వర్షం ఆకస్మిక వరదలకు దారితీస్తాయి.. కానీ.. స్వల్ప సమయంలో సంభవించే భారీ వర్షాలన్నింటి క్లౌడ్‌ బరస్ట్‌గా పరిగణించలేమని, కొన్ని వాతావరణ పరిస్థితులు ఉంటేనే వాటిని క్లౌడ్‌ బరస్ట్‌ పేర్కొనవచ్చని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

మేఘాల సాంద్రత పెరిగి..

మేఘాల సాంద్రత పెరిగి (బరువెక్కి) ఒక్కసారిగా విస్ఫోటంపై కుంభవృష్టి వర్షం కురుస్తొంది. క్లౌడ్‌ బరస్ట్‌ ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా, ఇది క్యుములోనింబస్‌ మేఘాల వల్ల సంభవిస్తుంది. మేఘాలు భూమి ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల వరకు నిలువుగా వ్యాపించి ఉంటాయి. మేఘాలలో నీటి ఆవిరి, నీటి బిందువులు, మంచు కణాలు అధిక మొత్తంలో నిల్వ ఉంటాయి. వాతావరణంలో అసాధారణ తేమ శాతం ఉన్నప్పుడు వేడిగా ఉండే గాలి పైకి వెళ్లేటప్పుడు చల్లబడి మేఘాలను ఏర్పరుస్తుంది. గాలి వేగంగా పైకి కదిలే కొద్దీ.. క్యుములోనింబస్‌ మేఘాలు భారీగా, నిలువుగా పెరుగుతాయి. మేఘాలలో ఎక్కువ మొత్తంలో నీటి బిందువులు మంచు కణాలు నిల్వ అవుతాయి. మేఘాలలోని పైభాగాన ఉన్న శీతల గాలులు నీటి బిందువులను కిందికి పడకుండా అడ్డుకుంటాయి. వర్షం పడే స్థితి ఏర్పడినప్పటికీ వేడి వాతావరణం వల్ల మేఘాలు ఘనీభవించడం కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశలో మేఘం తనలో ఉన్న నీటి మొత్తాన్ని నిలుపుకోలేనప్పుడు, మొత్తం నీరు ఒకేసారి ఒక నీటి స్థూపంలా కిందికి విపరీతమైన వేగంతో పడిపోతుంది.

అంచనా వేయడం కష్టమే

క్లౌడ్‌ బరస్ట్‌ను అంచనా వేయడం చాలా కష్టమని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది చాలా చిన్న ప్రాంతంలో, తక్కువ సమయంలో సంభవిస్తుంది. సాధారణ వాతావరణ రాడార్‌ వ్యవస్థలు వీటిని కచ్చితంగా గుర్తించలేవు. కొన్ని ఆధునిక వాతావరణ ఉపగ్రహాలు, రాడార్లు, సూపర్‌ కంప్యూటర్ల సహాయంతో వీటిని అంచనా వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అధిక వర్షపాతం 42.3 శాతానికిపైగా

గ్రేటర్‌ పరిధిలో ఈ వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణం కంటే అధికంగా 42.3 శాతం వర్షపాతం నమోదైంది. ముందస్తు వర్షాలు ప్రారంభమైనప్పటికీ.. మొదటి రెండు నెలలు సాధారణ వర్షం కంటే లోటు వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత వర్షాలు ఊపందుకున్నాయి. వరసగా కుండపోత వర్షాలు ఈ సీజన్‌కు ఊపిరిపోసినట్లయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్‌న్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 24 వరకు సాధారణంగా 593.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 844.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా అమీర్‌పేట్‌ 83 శాతం నమోదైంది. తిరుమలగిరి మండలంలో మాత్రం సాధారణం కంటే కేవలం 4 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది.

ప్రస్తుత సీజన్‌లో సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదు ఇలా..

అర్బన్‌ మండలం సాధారణ కురిసిన శాతం

వర్షపాతం వర్షపాతం

(మి.మీ) (మి.మీ)

అమీర్‌పేట్‌ 617.7 1130.6 83

ముషీరాబాద్‌ 599.6 1052.9 76

ఖైరతాబాద్‌ 610.4 1048.7 72

మారేడుపల్లి 596.0 1000.0 68

సికింద్రాబాద్‌ 595.2 992.5 67

మల్కాజిగిరి 536.2 883.1 65

శేరిలింగంపల్లి 609.1 973.7 60

షేక్‌పేట్‌ 595.1 944.5 59

హిమాయత్‌నగర్‌ 518.0 881.2 52

హయత్‌నగర్‌ 560.6 833.2 49

కాప్రా 535.7 799.9 49

కుత్బుల్లాపుర్‌ 605.4 891.8 47

కూకట్‌పల్లి 634.0 892.4 41

ఉప్పల్‌ 583.5 817.3 40

నాంపల్లి 601.1 833.5 39

సరూర్‌నగర్‌ 575.4 795.1 38

బండ్లగూడ 574.8 789.4 37

అల్వాల్‌ 537.1 719.8 34

ఆసిఫ్‌నగర్‌ 602.9 807.4 34

బహదూర్‌పురా 579.1 761.3 31

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement