
ఇంతకీ ఏం చేద్దాం?
సీఎం తిరిగే కేబీఆర్ పార్కు రోడ్డులో వరద సమస్య
బంజారాహిల్స్: రెండు రోజుల క్రితం భారీగా కురిసిన కుండపోత వర్షానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని రహదారులన్నీ నడుం లోతు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ఎక్కడి వరద అక్కడే అన్న చందంగా రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు సైతం అడ్డంకిగా మారాయి. సచివాలయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి 13 నిమిషాల్లో వెళ్లాల్సిన ముఖ్యమంత్రి సోమవారం రాత్రి 1.15 గంటల సమయంలో తీవ్ర ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళ్లాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి కాన్వాయ్ వరద నీటితో పాటు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రహదారులతో పాటు కేబీఆర్ పార్కు చుట్టూ పొంగిపొర్లుతున్న వరద సమస్య తీవ్రంగా మారింది. కేబీఆర్ పార్కులో చెరువులతో పాటు కుంటలు నిండిపోయి వరదంతా రోడ్ల పైకి వస్తుండడంతో సమస్య తీవ్రమైంది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం నడిరోడ్డులో ఆగిన కాన్వాయ్‌లో నుంచి ఈ పరిస్థితిని గమనించారు. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వరదనీటికి చెక్ పెట్టేందుకు ఒకవైపు హైడ్రా అధికారులు, ఇంకోవైపు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను పరిశీలిస్తున్నారు.
ఒక్క అడుగూ ముందుకు పడలేదు..
కేబీఆర్ పార్కులోంచి వస్తున్న వరదను శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ వైపు మళ్లించే యత్నాలపై కసరత్తు జరుగుతోంది. నెలరోజుల క్రితమే కేబీఆర్ పార్కు వద్ద భారీగా వరద నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ పర్యటించి కొత్త పైపులైన్లు వేయాలని ఇంజినీర్లను ఆదేశించారు.
ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. యథావిధిగా రోడ్లను వరద ముంచెత్తుతూనే ఉంది. రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడ పర్యటించారు. ఇంతవరకు పనుల్లో కదలిక లేదు. తాత్కాలికంగా వరదను మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు ఇందిరానగర్ వైపు రోడ్డును తవ్వగా గుంతలన్నీ వరదతో నిండిపోయాయి. ఆ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామా అని జలమండలి జీఎం ప్రభాకర్‌తో పాటు మేనేజర్లు రాంబాబు తదితరులు బుధవారం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పర్యటించారు. వీవీఐపీ రోడ్లలో వరదనీటి కాలువల వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ రోడ్డు కళ్లకు కడుతోంది.
ఇదీ పరిస్థితి..
● చాలాచోట్ల వరదనీటి కాలువల్లోకి డ్రైనేజీ పైప్‌లైన్లను కలిపినట్లు గుర్తించారు. ఐ ట్రిపుల్ సీ వద్ద ఎన్నడూ లేనంతగా నడుంలోతు నీరు నిలిచిపోతూ ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వస్తోంది. ఎందుకిలా జరుగుతుందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
● మరోవైపు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రెండువైపులా ఇంతవరకు వరదనీటి కాలువలే నిర్మించలేదని తేలింది. దీని ప్రభావమే వరద రోడ్లను ముంచెత్తుతున్నట్లుగా నిర్ధారించారు.
● కేబీఆర్ పార్కులో నుంచి వస్తున్న వరదను కాలువల్లోకి తరలిద్దామంటే ఎక్కడా వాటి ఆచూకీ కనిపించడం లేదు.
● మంత్రులు తిరిగినా, ప్రజాప్రతినిధులు పర్యటించనా, అధికారులు పరిశీలిస్తున్నా సీఎం రేవంత్ తిరిగే రోడ్డులో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ఈ సమస్య అధికారులకు తలనొప్పిగా మారింది.
● పైపులు వేద్దామంటే ఈ రోడ్డులో గంట పాటు తవ్వినా వేలాది వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇరిగేషన్, హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు తప్ప వరద ముంపు నుంచి ఈ రోడ్డును కాపాడలేకపోతున్నారనే విమర్శలున్నాయి.
ఓ వైపు మంత్రులు.. ఇంకోవైపు అధికారుల పర్యటనలు
అధికారుల తర్జన భర్జనలు..
ఇంజినీర్లకు మింగుడుపడని వ్యవస్థ
ఎంత వెతికినా కానరాని పరిష్కార మార్గాలు
కేబీఆర్ పార్కులో చెరువులా నిండి రోడ్లపైకి పారుతున్న నీరు