
అధికారుల్లోనూ ‘జూబ్లీహిల్స్’ గుబులు?
● ఎల్‌బీనగర్ జడ్‌సీ హేమంత్ కేశవ్‌పాటిల్‌కు అదనపు బాధ్యతలు
● కత్తిమీద సాములా మారిన ఎన్నికల నిర్వహణ
ఉప ఎన్నికల విధులు ఐఏఎస్ అధికారికి అప్పగింత
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్..! స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న సాధారణ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడిది అందరి గుండెల్లోనూ గుబులు రేపుతోంది. ఓవైపు రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక్కడ గెలవాలనే తలంపుతో అధికార కాంగ్రెస్‌తో పాటు తమ సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదనే టార్గెట్‌తో బీఆర్‌ఎస్ ఇప్పటికే తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి దక్కకుండా చేసేందుకు అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ముక్కోణపు పోటీ అయినప్పటికీ..
ఇక్కడ జరగనున్నది ముక్కోణపు పోటీ అయినప్పటికీ, బీజేపీ తగిన సమయంలో బహిరంగంగా రంగంలోకి దిగుతుందనే అభిప్రాయాలున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతో వైరి పక్షానికి సమాధానమివ్వాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ భావిస్తున్నాయి. గెలిచిన వారు కేవలం తమ గెలుపని చెప్పడమే కాదు.. ఓడిన వారిని ‘ఇక మీ పనైపోయింది’ అని ఎగతాళి చేసేందుకు ఇదే మంచి తరుణమనుకొని పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మంత్రులు వరద సమస్యలు పరిష్కరిస్తామంటూ బురదనీటిలో పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బూత్‌స్థాయి వరకు శిక్షణనిస్తున్నారు.
ప్రతీ అంశం సూక్ష్య స్థాయిలో..
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తిప్పలు పడటం కొంత సహజమే అయినా.. ఈ ఎన్నిక నిర్వహణ అధికారుల్లోనూ గుబులు రేపుతోంది. అందుకు కారణం రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ పరిణామంగా ఈ ఎన్నికలను భావిస్తున్న పార్టీలు.. ఓటర్ల జాబితాలో చేరికలు, తొలగింపుల నుంచి ప్రతి అంశాన్నీ సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. ఎవరి వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు వస్తాయో తెలియదు. ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియదు. ఎన్నికల సంఘం నుంచి పరిశీలకులుగా వచ్చేవారూ స్ట్రాంగ్‌గా ఉంటారనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగిస్తే మేలనే తలంపుతో కాబోలు ఈ ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అడిషనల్ కమిషర్ బాధ్యతల్ని ఐఏఎస్ అధికారికి అప్పగించారు.
ఉత్తర్వులు వెంటనే అమలులోకి..
ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్‌కు ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగం అడిషనల్ కమిషనర్‌గా ఉన్న కె.అలివేలు మంగతాయారుకు ఎన్నికల విభాగం స్థానే స్పోర్ట్స్ విభాగాన్ని అప్పగించారు. ఎన్నికల విభాగంతోపాటు ఆమె నిర్వహిస్తున్న ఎస్టేట్స్ విభాగాన్ని యథాతథంగా ఉంచారు. గత జూన్‌లో అడిషనల్ కమిషనర్ల బదిలీల సందర్భంగా యూబీడీ అడిషనల్ కమిషనర్ వి.సుభద్రాదేవికి స్పోర్ట్స్ విభాగం అదనపు బాధ్యతలప్పగించడం తెలిసిందే.