
ఇక తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్
సాక్షి, సిటీబ్యూరో: తెలుగుతల్లి స్థానంలో తెలంగాణ తల్లిని తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును సైతం తెలంగాణ తల్లిగా మార్చింది. నగరంలోని సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సెక్రటేరియట్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, మెహిదీపట్నం తదితర ప్రాంతాలవైపు వెళ్లేందుకు పయ్రాణించే తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. అది సైతం హడావుడిగా టేబుల్ అజెండాలో చేర్చి ఆమోదించింది. ఇటీవలే అన్నపూర్ణ పేరిట ఉన్న రూ.5 భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చడం తెలిసిందే. ఫ్లై ఓవర్ పేరు మార్పుతో సహా 14 అజెండా అంశాలు, 10 టేబుల్ అజెండా అంశాలతో కలిపి మొత్తం 24 అంశాలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. కమిషనర్ కర్ణన్, ఆయా విభాగాల ఉన్నతాధికారులు, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.
ఆమోదం పొందిన అంశాల్లో ముఖ్యమైనవి ఇవీ..
అల్వాల్ సర్కిల్‌లోని చిన్నరాయుని చెరువు నుంచి దినకర్ నగర్ వరకు రూ.2.95 కోట్ల అంచనా వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. మల్లేపల్లిలో రూ. 4.85 కోట్ల వ్యయంతో ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆధునికీకరణ. మౌలాలిలో జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయ భవనం ఒకటో అంతస్తులో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు. సుబాష్ చంద్రబోస్ నగర్, ఆదిత్య నగర్ (మాదాపూర్)లో రూ. 2.80 కోట్ల వ్యయంతో శ్మశాన వాటికల అభివృద్ధి. శిల్పా హిల్స్ (ఎస్సీ శ్మశాన వాటిక), కృష్ణానగర్ (హిందూ శ్మశాన వాటిక)ల అభివృద్ధి. అంచనా వ్యయం రూ.2.40 కోట్లు. వీధిదీపాల నిర్వహణ ప్రస్తుతం నిర్వహిస్తున్న వారికే మరో మూడు మాసాల పొడిగింపు. ట్రేడ్ బోర్డ్స్/ప్రకటన లైసెన్స్‌ల జారీ అధికారం డిప్యూటీ కమిషనర్లకు అప్పగింత. అప్పీల్ అధికారులుగా జోనల్ కమిషనర్లు. ఐటీ వింగ్ ద్వారా ప్రకటన మాడ్యూల్ సవరణ.
సమావేశంలో పాల్గొన్న మేయర్, కమిషనర్ తదితరులు
తెలుగు తల్లి పేరు మార్పునకు ఆమోదం
మొత్తం 24 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఓకే