
శరవేగంగా హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
సాక్షి, సిటీబ్యూరో: హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.29.21 కోట్లు కేటాయించింది. వేగంగా వృద్ధి చెందుతున్న గ్రేటర్ పశ్చిమ ప్రాంతాలు, ఐటీ కంపెనీలు స్టేషన్‌కు దగ్గరగా ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. జంట నగరాల్లో సబర్బన్ రైల్వేస్టేషన్‌లలో హఫీజ్‌పేట్ గ్రేడ్– 3లో ఉంది. ఈ స్టేషన్ నుంచి సగటున రోజుకు 9 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 60 ఎంఎంటీఎస్, 8 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్లాట్‌ఫాం పైకప్పు అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాం ఉపరితలం అభివృద్ధి, సర్క్యులేటింగ్ ఏరియా, సూచీ బోర్డులు, విద్యుత్తు లైటింగ్, భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో అధునాతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.