
రసవత్తరంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నికలు
అబిడ్స్: నగరంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సొసైటీ అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికై నప్పటికీ మిగతా పాలకవర్గ కార్యవర్గానికి ఈ నెల 26న శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఎగ్జిబిషన్ సొసైటీకి ఎన్నికలు జరుగుతాయి. దాదాపు ప్రతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేది. కానీ ఈ సంవత్సరం అధ్యక్ష పదవి మినహా ఉపాధ్యక్షుడు, గౌరవ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, 7 మంది మేనేజింగ్ కమిటీ సభ్యుల పోస్టులకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు రావడంతో శుక్రవారం ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గంలోని కొందరి నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన సభ్యులు కొత్త పాలకవర్గం కావాలని, మార్పు కోరుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా ప్రస్తుత పాలకవర్గం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే కొంతమంది సభ్యులు లిఖిత పూర్వకంగా వివరణలు కోరినప్పటికి ప్రస్తుత పాలకవర్గం ఇప్పటి వరకు సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తుంది. వారి ఏకపక్ష నిర్ణయాలపై రాబోయే జనరల్‌బాడీ సమావేశంలో ప్రశ్నించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని కొంత మంది సభ్యులు బహిరంగంగా పేర్కొంటున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా స్టాళ్ల అద్దెలు, ప్రవేశ రుసుములను పెంచి తాము ఆదాయాన్ని పెంచినట్లు కొంతమంది పేర్కొనగా..అధికమంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. స్టాళ్ల అద్దెను గత రెండు మూడు సంవత్సరాలలో అడ్డగోలుగా పెంచడంతో పలు రాష్ట్రాల నుంచి వచ్చే స్టాళ్ల నిర్వాహకులు, పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
కొన్ని కళాశాలలకే ఆర్థిక సహాయం?
ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపు 20 విద్యాసంస్థలు తెలంగాణ రాష్ట్రం నలుమూలలా కొనసాగుతున్నాయి. కానీ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్ని విద్యాసంస్థలకు పంపిణీ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిద్దరు సభ్యులు తమకు నచ్చిన కళాశాలలకు పెద్ద ఎత్తునఫండ్స్ ఇస్తూ మిగతా కళాశాలలకు ఫండ్స్ ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకరిద్దరు సభ్యులు కొన్ని సంవత్సరాలుగా అన్నీ తామై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారి నియంతృత్వ వైఖరితోనే ఎన్నికలు అనివార్యమయ్యాయని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. కాగా 1938 సంవత్సరంలో అప్పటి నిజాం కాలంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పడింది. 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీకి 277 మంది సభ్యులు ఉన్నారు.
రేపు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు
ఇప్పటికే అధ్యక్ష పదవి ఏకగ్రీవం
మిగతా పదవులకు తప్పని పోటీ