ఆస్తి తగాదాలతో కక్ష..బాబాయ్‌ను హత్యచేసిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదాలతో కక్ష..బాబాయ్‌ను హత్యచేసిన యువకుడు

Sep 25 2025 1:19 PM | Updated on Sep 25 2025 1:19 PM

ఆస్తి తగాదాలతో కక్ష..బాబాయ్‌ను హత్యచేసిన యువకుడు

ఆస్తి తగాదాలతో కక్ష..బాబాయ్‌ను హత్యచేసిన యువకుడు

గంటల వ్యవధిలోనే నిందితుల పట్టివేత ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు

రాజేంద్రనగర్‌: ఆస్తి తగాదాల నేపథ్యంలో స్నేహితుడితో కలిసి బాబాయ్‌ను చంపిన యువకుడిని రాజేంద్రనగర్‌ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి రిమాండ్‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక ప్రాంతానికి చెందిన మినాజుద్దీన్‌(35) గతంలో బతుకు తెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. హఫీజ్‌బాబానగర్‌లో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మినాజుద్దీన్‌ సోదరుడు ఎం.ఎం.పహాడీ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం అతను మృతి చెందాడు. గ్రామంలోని పొలం విషయమై మినాజుద్దీన్‌కు, అన్న కుటుంబానికి మధ్య గొడవ జరుగుతుంది. మంగళవారం రాత్రి మినాజుద్దీన్‌ పహాడీలోని సోదరుని ఇంటికి వెళ్లి వదినతో మాట్లాడాడు. అప్పుడే బయటి నుంచి వచ్చిన అన్న కుమారుడు ఆర్భాజ్‌ (19) ఇదే విషయమై చర్చించారు. గత వారం ఆర్భాజ్‌ ఓ విందుకు హాజరైన సమయంలో అక్కడే ఉన్న మినాజుద్దీన్‌ మధ్య మాటామాట పెరిగింది. ఆస్తి విషయంలో అడ్డు వస్తే ప్రాణాలను సైతం తీస్తానని మినాజుద్దీన్‌..ఆర్భాజ్‌ను హెచ్చరించాడు. దీనిని మనుసులో పెట్టుకున్న ఆర్భాజ్‌ మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన మినాజుద్దీన్‌తో మాట్లాడాడు. అనంతరం ఆర్భాజ్‌ తన స్నేహితుడు సులేమాన్‌కు ఫోన్‌ చేసి కారు తీసుకొని రమ్మన్నాడు. సులేమాన్‌ డ్రైవర్‌ కావడంతో కారు తీసుకొని ఎం.ఎం.పహాడీకి చేరుకున్నారు. ముగ్గురు కలిసి కారులో బయలుదేరగా..ఆర్భాజ్‌, మినాజుద్దీన్‌లు మొదట ఆరాంఘర్‌లోని ఓ హోటల్‌లో టీ తాగారు. అనంతరం సులేమాన్‌ కారు నడపగా...ముగ్గురూ మాట్లాడుకుంటూ అర్ధరాత్రి నాంపల్లికి చేరుకున్నారు. నాంపల్లి ప్రాంతంలో మద్యం తాగి తిరుగు ప్రయాణమయ్యారు. మద్యం మత్తులో గ్రామంలోని పొలం విషయమై మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే కత్తిని తన వద్ద ఉంచుకున్న ఆర్భాజ్‌ తన ముందు సీట్లో కూర్చున్న మినాజుద్దీన్‌ గొంతు కోశాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం శవాన్ని రాజేంద్రనగర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ సబ్‌ రోడ్డుపై వేసి ఇంటికి వెళ్లిపోయారు. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మినాజుద్దీన్‌ మృతదేహాన్ని చూసి స్థానికులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌ను రప్పించి పూర్తి వివరాలను సేకరించారు. నిందితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, గుర్తింపు కార్డులతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మినాజుద్దీన్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారంతో ఆర్భాజ్‌ను పట్టుకొని విచారణ చేయగా తన స్నేహితుడు సులేమాన్‌తో కలిసి హత్య చేసినట్లు వెల్లడించాడు. నిందితులు ఉపయోగించిన కారుతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇరువురిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement