
బత్తుల ప్రభాకర్ ఎక్కడ?
గచ్చిబౌలి: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి సోమవారం రాత్రి ఎస్కేప్ అయిన అంతరాష్ట్ర నేరగాడు బత్తుల ప్రభాకర్ కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతడు ఆఖరుసారిగా గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 1న చిక్కాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్‌పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీ పోలీసులు అతడి కోసం నగరంలోనూ గాలిస్తున్నారు. మరోపక్క ఈ కరుడుగట్టిన ఖరీదైన దొంగ మరో నేరం చేయకుండా పట్టుకోవాలని నిర్ణయించుకున్న మూడు కమిషనరేట్ల అధికారులు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ బృందాలను అప్రమత్తం చేశాయి. ప్రిజం పబ్ వద్ద ఇతడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ప్రభాకర్ కోసం గాలించే బృందాల వద్ద కచ్చితంగా తుపాకీ ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఆరా తీస్తున్న మూడు కమిషనరేట్ల అధికారులు