
వలస కూలీల పిల్లలే టార్గెట్
చిన్నారుల కిడ్నాప్ ముఠా అరెస్ట్
● నర్సింగ్ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ రిజ్వానా ఆధ్వర్యంలో దందా
● పిల్లలు లేని వారికి విక్రయం
● సంతానలేమిని ఆసరాగా చేసుకుని రూ. లక్షలు వసూలు
● ఇద్దరు చిన్నారులను రూ. 4.5 లక్షలకు విక్రయించిన తండ్రి
● ఆరుగురు చిన్నారులను కాపాడిన చందానగర్ పోలీసులు
● నలుగురు నిందితుల అరెస్ట్, రూ. ఐదు లక్షల నగదు స్వాధీనం
గచ్చిబౌలి: రైల్వే స్టేషన్ల సమీపంలో వలస కూలీల పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. గత నెల 25న లింగంపల్లిలోని పోచమ్మ ఆలయ సమీపంలో ఆడుకుంటున్న అఖిల్ (05) అనే చిన్నారి కనిపించకపోవడంతో మర్నాడు అతడి తల్లిదండ్రులు చందానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లు గుర్తించారు. దీంతో బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులు పటాన్‌చెరుకు చెందిన చిలుకూరి రాజు, మూసాపేట్‌కు చెందిన నర్సింహారెడ్డి, పటాన్‌చెరుకు చెందిన మహ్మద్ అసీఫ్, సిద్ధిపేటలో నర్సింగ్ క్లీనిక్ నిర్వాహకురాలు డాక్టర్(బీఏఎంఎస్) రిజ్వానాను అరెస్ట్ చేశారు. పటాన్‌చెరుకు చెందిన మరో నిందితుడు బాలరాజు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
రైల్వే స్టేషన్లే కేంద్రాలు..
గత ఐదేళ్లుగా ఈ ముఠా రైల్వే స్టేషన్ల సమీపంలో నివాసం ఉంటున్న వలస కూలీల పిల్లలను టార్గెట్‌గా చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అఖిల్ కిడ్నాప్ కేసు విచారణలో మరిన్ని కిడ్నాప్ కేసులు వెలుగులోకి వచ్చాడయి. అఖిల్‌ను కిడ్నాప్ చేసిన ముఠా రూ. 7 లక్షలకు సిరిసిల్లా జిల్లా, జిల్లెల గ్రామానికి చెందిన సిరవేని లక్ష్మీకి విక్రయించినట్లు డీసీపీ తెలిపారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోనే చిలుకూరి రాజు మరో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేశాడు. 2024 ఆగస్టు 17న బాలమణి కుమారుడు అరుణ్(02)ను కిడ్నాప్ చేసి గొల్లపల్లికి చెందిన సుజాతకు రూ.2.10 లక్షలకు విక్రయించాడు. 2025లో లింగంపల్లిలో అమ్ములు(8 నెలలు) అనే చిన్నారిని ఎత్తుకెళ్లి సిరిసిల్ల జిల్లా నామాపూర్‌కు చెందిన లక్ష్మికి రూ.3.5 లక్షలకు విక్రయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో లాస్య(05) అనే బాలికను అపహరించి సంగారెడ్డి జిల్లా, రాయపల్లికి చెందిన మాధవికి రూ.42 వేలకు విక్రయించారు.
కన్న తండ్రే అమ్మేశాడు..
పటాన్‌చెరు చెందిన నల్ల బాలరాజు తన కుమారుడు ఆద్విక్(02), కుమార్తె ప్రియ(01)లను నిందితుడు మహ్మద్ ఆసీఫ్‌కు రూ.4.5 లక్షలకు విక్రయించాడు. అతను ఆద్విక్‌ను రూ.2.5 లక్షలకు పటాన్‌చెరు గొల్లపల్లికి చెందిన మెట్టు దుర్గాకు, కుమార్తె ప్రియను రూ.2 లక్షలకు ఉస్మాన్‌నగర్‌కు చెందిన సింగోలి మహేశ్వరికి విక్రయించాడు.
ఆరుగురు చిన్నారులను
కాపాడిన పోలీసులు
ఈ ముఠా విక్రయించిన ఆరుగురు చిన్నారులను చందానగర్ పోలీసులు కాపాడారు. వారిలో నలుగురిని రంగారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్‌కు అప్పగించారు. నలుగురు చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించగా మరో ఇద్దరు చిన్నారులు అమ్ములు, లాస్య తల్లిదండ్రుల వివరాలు తెలియరాలేదు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ద్వారా వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
పక్కాగా..పకడ్బందీగా..
క్లినిక్ మాటున దందా..
సిద్దిపేటలో నర్సింగ్ క్లినిక్ నిర్వహిస్తున్న రిజ్వానా ఆధ్వర్యంలో ఈ ముఠా ఐదేళ్లుగా కిడ్నాప్‌లకు పాల్పడుతోంది. సంతానం లేని వారు రిజ్వానా సంప్రదించిన వెంటనే ఆమె ముఠాకు సమాచారం అందిస్తుంది. దీంతో నర్సింహా రెడ్డి రెక్కీ నిర్వహించి ఒంటరిగా ఉన్న చిన్నారులను గుర్తించి రాజుకు తెలియజేస్తాడు. రాజు వారిని కిడ్నాప్ చేసి ఆసీఫ్‌కు సమాచారం అందిస్తాడు. రాజు రిజ్వానా ఇచ్చిన అడ్రస్‌లో సంబందిత వ్యక్తులకు చిన్నారులను అప్పగించి నగదు తీసుకునేవాడు. అఖిల్‌ను విక్రయించిన కేసులో రాజు రూ.3.5 లక్షలు, ఆసీఫ్ రూ.2 లక్షలు, రిజ్వానా రూ.1.5 లక్షలు పంచుకున్నట్లు తెలిపారు. ఎన్ని కిడ్నాప్ ముఠాలతో రిజ్వానాకు సంబంధం ఉంది అనే అంశంపై విచారణ చేపడతామని డీసీపీ తెలిపారు. పిల్లలను కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎస్.విజయ్, డీఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.