
నిమజ్జనోత్సవం విషాదాంతం
● వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి
● దుండిగల్‌లో చెరువులో ఆటో పడి తండ్రీ కొడుకు దుర్మరణం
● హిమాయత్ సాగర్‌లో యువకుడి మృతి
దుండిగల్: వినాయకుడిని నిమజ్జనం చేసిన అనంతరం ప్రమాదవశాత్తు ఆటో చెరువులో పడి తండ్రి, కొడుకు మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దుండిగల్, శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన డొక్క శ్రీనివాస్(34) ఆటోలో ఆకు కూరలను విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య సోని, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారి ఇంటి పక్కనే కాలనీకి చెందిన చిన్నారులు వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు శ్రీనివాస్ సాయం కోరడంతో అతను తన పెద్ద కుమారుడు జాన్ వెస్లీ(07)తో కలిసి వినాయకుడిని తీసుకుని స్థానిక నాగులూరు పెద్ద చెరువుకు వచ్చాడు. అనంతరం చిన్నారులు వినాయకుడిని మెట్ల మార్గంలో తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. వారు చెరువు కట్టపైకి చూడగా ఆటో కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటారని భావించి నడుచుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు.
రాత్రి ఇంటికి రాకపోవడంతో..
నిమజ్జనం కోసం వెళ్లిన భర్త, కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్ భార్య సోని మండప నిర్వాహకులను ఆరా తీయగా తమకు తెలియదని చెప్పారు.దీంతో ఆమె స్థానికులతో కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాయికి అంటిన రంగుతో గుర్తించి..
నాగులూరు చెరువు కట్ట చిన్నగా ఉండడంతో ఆటో ముందుకు వెనుకకు తిప్పే క్రమంలో కట్టపై ఉన్న రాయికి ఆటో ట్రాలీ తగిలి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి ఉంటుందని పోలీసులు గుర్తించారు. రాయికి తగలిన మరక ఆధారంగా పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందం నాలుగు గంటల పాటు శ్రమించి చెరువులో నుంచి ఆటోతో పాటు తండ్రి, కొడుకుల మృతదేహాలను వెలికి తీశారు. వెనక్కి తీస్తున్న క్రమంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లడం.. రెండు వైపులా డోర్లు లాక్ కావడంతో నీళ్లలో నుంచి బయటకు వచ్చే ఆస్కారం లేకపోవడంతో తండ్రి, కొడుకులు మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు నీటిలో పడి..
రాజేంద్రనగర్: ఇంట్లో ప్రతిష్టించిన గణనాథున్ని హిమాయత్‌సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్(28) తన ఇంట్లో ప్రతిష్టించిన గణనాథున్ని నిమజ్జనం చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడితో కలిసి బైక్‌పై హిమాయత్‌సాగర్‌కు వచ్చాడు. సాగర్‌లో గణేషుడిని నిమజ్జనం చేసేందుకు దారి లేకపోవడంతో చౌడమ్మ గుట్ట ప్రాంతంలోని చెరువు కట్టకు చేరుకున్నాడు. హిమాయత్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలపై నిషేధం ఉన్నందున చెట్ల పొదల గుండా నీటి వద్దకు వెళ్లిన సాయికుమార్ కాలు జారడంతో ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు. రోడ్డుపై ఉన్న స్నేహితుడు దీనిని గుర్తించి కేకలు వేయడంతో స్థానికులు, వాహనదారులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చేపట్టిన పోలీసులు రాత్రి సాయి కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.