
‘నష్ట’మర్ కేర్!
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నెంబర్‌లో సంప్రదించి నష్టపోయింది ఒకరైతే... అంతకుచిక్కకుండా అమేజాన్ పే రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ మారిపోవడంతో బ్యాలెన్స్ కోల్పోయారు మరొకరు. ఈ ఇద్దరు నగరవాసులు ఇచ్చిన ఫిర్యాదులతో సోమవారం వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆజంపుర ప్రాంతానికి చెందిన వ్యక్తి (69) గత నెల 26న బ్లింకిట్ యాప్ ద్వారా మేకప్ కిట్ ఆర్డర్ ఇచ్చారు. తమకు వచ్చిన వస్తువులు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించిన అతను వాటిని రిటర్న్ చేసేందుకు బ్లింకిట్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన ఓ నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ అసలైనదిగా భావించిన బాధితుడు దానిని సంప్రదించాడు. ఆ కాల్ అందుకున్న వ్యక్తి తాను బ్లింకిట్ యాప్ ప్రతినిఽధిగా పరిచయం చేసుకున్నాడు. బాధితుడి సమస్య విని.. ఆ ఉత్పత్తులు రీప్లేస్ చేస్తానంటూ హామీ ఇచ్చాడు. ఆపై కొంతసేపటికి వాట్సాప్ ద్వారా సంప్రదించిన మరో వ్యక్తి తాను బ్లింకిట్ తరఫు నుంచి మాట్లాడుతున్నానని నమ్మించాడు. బాధితుడి నుంచి ఆయన భార్య ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. దానికి ఓ లింకు పంపిన అతగాడు దీన్ని వినియోగించి పేటీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రక్రియ పూర్తి చేయాలని సూచించాడు. బాధితుడు అలానే చేయడంతో ఆ లింకులో ఉన్న యాండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్ ఆమె ఫోన్‌లో నిక్షిప్తమైంది. దీని ఆధారంగా ఆమె యూపీఐ యాప్స్ వాడిన నిందితులు వాటి నుంచి రూ.4193 కాజేశారు. దీనిని గుర్తించిన బాధితుడు ఫోన్ ద్వారా బ్లింకిట్ ప్రతినిధిగా చెప్పుకున్న వ్యక్తిని సంప్రదించాడు. ఏదో పొరపాటు జరిగిందని చెప్పిన అతగాడు ఆ మొత్తం కూడా రిఫండ్ అవుతుందని చెబుతూ ఈసారి బాధితుడి కుమార్తె ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయించాడు. అదే పంథాలో ఆమె ఖాతాలో ఉన్న రూ.98,001 కాజేశారు. ఇలా మొత్తం రూ.1,02,194 కోల్పోయిన బాధితుడు ఎట్టకేలకు తాను మోసపోయానని గుర్తించి, సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించాడు. మరో ఉదంతంలో చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడు (37) అంతుచిక్కని సైబర్ నేరంలో రూ.1,11,740 కోల్పోయాడు. గత నెల 14న సదరు యువకుడు తన అమేజాన్ పే ఖాతాలోకి గిఫ్ట్ ఓచర్ల ద్వారా రూ.1,12,500 యాడ్ చేసుకున్నాడు. దీంతో పాటు తన వద్ద ఉన్న మొత్తాన్ని వెచ్చించి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నుంచి అమేజాన్ యాప్ ద్వారా రెండు ఐదు గ్రాముల బంగారు నాణేలు ఆర్డర్ చేశారు. 17న ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన ఆ సంస్థ యువకుడు వెచ్చించిన మొత్తాన్ని అతడి అమేజాన్ పే ఖాతాకు బదిలీ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు అమేజాన్‌లో అతడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ మారిపోయింది. ఆపై అందులో ఉండాల్సిన రూ.1,11,740 మాయమయ్యాయి. 19న అమేజాన్ సంస్థను సంప్రదించిన బాధితుడు ఈ విషయం తెలుసుకున్నాడు. ఎట్టకేలకు దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ నేరం ఎలా జరిగింది? రిజిస్టర్డ్ నెంబర్, మెయిల్ ఐడీ ఎలా మారాయి? తదితర అంశాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.
గూగుల్‌లో కనిపించిన నకిలీ కస్టమర్ కేర్ నెంబర్
నిజమైనదిగా నమ్మి సంప్రదించిన నగర బాధితుడు
ఇద్దరికి ఏపీకే ఫైల్స్ పంపి రూ.1.02 లక్షలు స్వాహా
అంతుచిక్కని అమేజాన్ పే ‘మార్పిడి’ లావాదేవీలు
నగర సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదు