
‘ఖజానా’ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
చందానగర్: ఖజానా జ్యువెలరీ దోపిడీ ఘటనలో మరో ఇద్దరు దొంగలను గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. ఖజానా దొంగతనం కేసులో ఆరుగురు నిందితులు పాల్గొనగా..ఒకడు సహకరించాడు. వీరిలో ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ షాలను ఈ నెల 15న పుణేలో అరెస్ట్ చేయగా, అనిష్‌కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లను 19వ తేదీన పుణేలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రిన్స్ కుమార్ భారతి, రోహిత్ కుమార్ రజాక్ అలియాస్ రోహిత్ భాటియా (ఖజానాలో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయం చేసిన వ్యక్తి)లను గుజరాత్‌లో శనివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు (17) మైనర్ కావడంతో బిహార్‌లో అదుపులో తీసుకొని అక్కడి కోర్టులోనే హాజరుపర్చారు. కాగా వారి వద్ద నుంచి 1915 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకోగా, ప్రధాన నిందితుల వద్ద నుంచి కిలోన్నర వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రిన్స్ కుమార్ భారతీ అరు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. రోహిత్ కుమార్ రజాక్‌పై బిహార్ రాష్ట్రం సరణ్ జిల్లాలో దోపిడీ కేసు నమోదై ఉంది. నిందితులను పట్టుకోవడంలో సైబరాబాద్ ఎస్‌ఓటీ, సీసీఎస్, లా అండ్ ఆర్టర్ పోలీసులు తీవ్రంగా శ్రమించారంటూ వారిని సీపీ అభినందించారు.
జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు సోమవారం నుంచి ఇంటింటికీ జ్వరాల సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆశాలు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరిగి జ్వర పీడితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.
సమన్వయంతో పని చేయాలి
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్‌ఎంల సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగీ, చికున్ గున్యా మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వర్షాలకు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ షికాహయత్, డాక్టర్ విజయ పూర్ణిమ, జల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.