
నిందితుడిని శిక్షించి మాకు న్యాయం చేయండి
మూసాపేట: కూకట్‌పల్లిలోని దయార్‌గూడలో హత్యకు గురైన సహస్ర తల్లిదండ్రులు, బంధువులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ డౌన్‌డౌన్, ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్, ఇన్‌స్పెక్టర్ కె.వి.సుబ్బారావు, పోలీస్ సిబ్బంది కలిసి బాలిక తల్లిదండ్రులను, బంధువులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపచేశారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బాలుడిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా అతడికి సపోర్టు చేశారని, వారికి కూడా శిక్ష పడాలని కోరారు. ఇలాంటి కడుపుకోత మరే తల్లిదండ్రులకు రాకూడదన్నారు. బాలిక తల్లి రేణుక మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి హత్య చేస్తే భయపడే విధంగా చట్టాలు రావాలని, ఇలా వదిలేస్తే ఇంకా ఎంతమంది తల్లులకు కడుపుకోత ఉంటుందోనని అన్నారు. తన పాప ఏమి అన్యాయం చేసిందని అన్ని కత్తి పోట్లు పొడవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.
సహస్ర పేరిట కొత్త చట్టం తీసుకురావాలి: బక్కి వెంకటయ్య
ఎస్‌సీఎస్‌టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దయార్‌గూడలో బాలిక నివాసానికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి సహస్ర కుటుంబ సభ్యులకు అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పారు. సహస్ర పేరుమీదనే బలమైన చట్టం తీసుకు వచ్చేలా ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు. కొత్త చట్టం వస్తేనే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని, భయం ఉంటుందని అన్నారు. కాగా కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద బాలిక తల్లిదండ్రులను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఏ. పాల్ పరామర్శించారు. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదంటే కొత్త చట్టాలు తీసుకురావాలని అన్నారు.
సహస్ర తల్లిదండ్రుల డిమాండ్
కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా.. రాస్తారోకో