
మట్టి విగ్రహాలనే పూజిద్దాం
సనత్‌నగర్: గణేష్ చతుర్ధి వేడుకల సందర్భంగా భక్తులు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ కోరారు. పర్యావరణ అనుకూలమైన గణేష్ విగ్రహాలను పూజించాలంటూ రూపొందించిన అవగాహన ప్రచార పోస్టర్లను శనివారం సచివాలయంలోని ఆమె ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నుంచి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకు మారాలన్నారు. మట్టి గణేష్ విగ్రహాలను తయారుచేసి ఇంట్లో, నివాస ప్రాంతాల్లో పూజిద్దామన్నారు. పూజల్లో ఉపయోగించే పూలు, మూలికలను కంపోస్ట్ చేయాలని, బయోడిగ్రేడబుల్ కాని పదార్థాలను నీటి వనరుల్లో వేయకూడదని చెప్పారు. 2025 గణేష్ చతుర్ధికి సంబంధించి టీజీ పీసీబీ మట్టి గణేష్ విగ్రహాల ప్రచారం నిమిత్తం పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. అలాగే జీహెచ్‌ఎంసీతో పాటు వివిధ జిల్లాల్లో పీసీబీ ఆధ్వర్యంలో 3.24 లక్షలకు పైగా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు చేపడుతునట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి.రవి, చీఫ్ ఇంజనీర్ రఘు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
టీజీపీసీబీ ఆధ్వర్యంలో 3.24 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ