
గొప్ప దార్శనికుడు పీవీఆర్‌కే ప్రసాద్
ఉప్పల్: దివంగత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ గొప్ప దార్శనికుడు, సంస్కర్త అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పద్మశ్రీ డా.డి హనుమాన్ చౌదరి కొనియాడారు. ధర్మం కోసం నిత్యం పరితపించేవాడని గుర్తు చేసుకున్నారు. పీవీఆర్‌కే ప్రసాద్ 85వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉప్పల్ భగాయత్‌లోని ఐ ఫోకస్ కార్యాలయంలో మిషన్ చీఫ్ కో–ఆర్డినేటర్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పూర్తి సభ’కు హనుమాన్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసాద్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేసి మంచి పేరు సంపాదించారన్నారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నోమార్పులు తీసుకు వచ్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని నమ్మేవారని గుర్తు చేశారు. దళితులు, మత్స్యకారులను టీటీడీ ఖర్చులతో రప్పించి తిరుమలలో స్వామి వారి దర్శనం చేయించే వారని గుర్తు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రసాద్ కృషిని గుర్తించి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వయంగా ప్రశంసించారన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు, శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం ట్రస్టీ డా.సి.విజయ రాఘవాచార్యులు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీఆర్‌కే ప్రసాద్ సతీమణి గోపిక తదితరులు పాల్గొన్నారు.
పద్మశ్రీ హనుమాన్ చౌదరి