
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఉప్పల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఇందుకు మండప నిర్వాహకులు, భక్తులు, కాలనీ అసోసియేషన్లు సహకరించాలని మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజా రెడ్డి సూచించారు. పండుగ సమీపిస్తున్న కొద్ది నగరంలో హడావుడి పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీస్ గస్తీని కూడా పెంచామన్నారు. వినాయక మండప నిర్వాహకులతో శనివారం సాయంత్రం ఉప్పల్ భగాయత్‌లోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వినాయక ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీక అన్నారు. మెరుగైన భద్రతకోసం మండపాల వద్ద అన్ని సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రత్యేక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు చక్రపాణి, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు భాస్కర్, గోవింద్ రెడ్డి, రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.