
గరిష్టంగా ఏ సైజు విగ్రహాలకు ఎంత చెల్లిస్తారో వివరాలిలా...
ఖర్చు లేకుండా అవకాశమున్నా తీరు మారని బల్దియా
సీఎస్సార్ నిధులు వినియోగించకపోవడం విడ్డూరం
జీహెచ్‌ఎంసీ ఖజానాకు గండి కొట్టే యత్నం
ఎవరి పాత్ర ఏమిటో.. గణనాథా నీకే ఎరుక
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ) బదులు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని పంపిణీ చేయాలన్న జీహెచ్‌ఎంసీ ఆలోచన మంచిదే. ప్రతిమలను ఉచితంగానే పంపిణీ చేసేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. ఆ సంస్థలను సంప్రదించకుండా జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే అందుకు నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమవడం ఆరోపణలకు తావిస్తోంది.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ చెరువుల ప్రక్షాళన, తదితర కార్యక్రమాల కోసం స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్సార్ నిధులతో పనులు చేస్తోంది. కోట్లాది రూపాయలతో ఆ పనులు చేస్తున్న జీహెచ్‌ఎంసీకి.. మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సీఎస్సార్ నిధులు వినియోగించుకోవాలనే ఆలోచన రాకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీలోనే పనులు చేస్తూ ఏటా కోట్ల రూపాయల పనులు పొందుతున్న సంస్థలు సైతం స్వచ్ఛందంగా వాటంతట అవే ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. కనీ సం ఆ సంస్థలను సంప్రదించినా జీహెచ్‌ఎంసీకి రూ పాయి ఖర్చు లేకుండా, ఖజానాపై ఎలాంటి భారం పడకుండా ప్రజలకు ఉచితంగానే మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం సాధ్యమయ్యేది.
టెండర్లకు వెళ్లేందుకే..
ఎల్–1 ధరలకు మట్టి వినాయక విగ్రహాలను సరఫరా చేసే సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా బల్దియా తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. అది ఏమైనా ఆ రంగంలో పని చేస్తున్నవారందరూ వినియోగించుకునేలా ఉందా? అంటే అదీలేదు. కేవలం రెండు రోజుల గడువులో కేవలం వ్యక్తిగతంగానే టెండర్లు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హులైన వారిని ఎంప్యానెల్‌కు ఎంపిక చేశాక మూడు రోజుల్లో విగ్రహాలను నిర్ణీత ప్రాంతాలకు పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టెండరులో పాల్గొనేందుకు ఆన్‌లైన్ అవకాశమూ ఇవ్వలేదు. ఏవైనా సందేహాలుంటే సంప్రదించాలంటూ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవారే లేరు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ‘ఆస్థాన కళాకారుల’ కోసమే ఈ టెండర్లు పిలిచినట్లుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తూతూమంత్రంగా..
గతంలోనూ ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలని ప్రకటనలు గుప్పించినప్పటికీ.. ఒప్పందం మేరకు తయారు చేయాల్సినన్ని చేయలేదనే ఆరోపణలున్నాయి. తయారైన వాటిని ఎన్ని చోట్ల ఎవరికి పంపిణీ చేశారో తెలియదు. కొన్ని చెత్త కుప్పల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి. ఆ మాత్రం దానికి జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచి ఖర్చు చేయడం ఎందుకనే విమర్శలు వెల్లువెత్తినా.. జీహెచ్‌ఎంసీ ఇంకా గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు.
ఇలా చేయాల్సింది..
ఒకవేళ నిజంగానే చెరువులు కలుషితం కాకుండా ఉండేందుకు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటే ఇందిరా మహిళాశక్తి పేరిట క్యాంటీన్ల వంటివి ఏర్పాటు చేయిస్తున్న జీహెచ్‌ఎంసీ.. సెల్ఫ్‌హెల్ప్ గ్రూపు మహిళా సంఘాల ద్వారా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయించి పంపిణీ చేస్తే.. అటు వారికి ఉపాధి, ఇటు పర్యావరణహితమూ సాధ్యమయ్యేవని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
ఏవి ఎన్నో వివరాలేవి?
గతంలో మాదిరిగానే 8 అంగుళాలవి, 1 అడుగు, 1.5 అడుగుల మట్టి విగ్రహాలు నిర్ణీత వ్యవధిలోగా అందించాలని పేర్కొన్నప్పటికీ, ఏ సైజువి ఎన్నో వివరాల్లేవు. అంటే అవసరాన్ని బట్టి విగ్రహాల సంఖ్యను పెంచుతారో, తగ్గిస్తారో చెప్పలేని పరిస్థితి. దీంతో.. విగ్రహాల పేరిట ఈసారి ఎన్ని నిధులు ఖర్చు చేయనున్నారో తెలియదు. గతంలో రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు.
ఇవీ ధరలు..
గరిష్టంగా ఏ సైజు విగ్రహాలకు ఎంత చెల్లిస్తారో వివరాలిలా ఉన్నాయి.
● 8 అంగుళాల విగ్రహం: రూ. 33.39
● 1 అడుగు విగ్రహం: రూ.136.50
● 1.5 అడుగు విగ్రహం: రూ.339.15