
కుక్కలు.. పీకేస్తున్నాయి పిక్కలు!!
గ్రేటర్ పరిధిలో వీధి శునకాల వీరంగం
ఫీవర్ ఆస్పత్రికి నిత్యం భారీ సంఖ్యలో బాధితుల రాక
నెలలో కనీసం రెండు రేబిస్ కేసులు నమోదు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. గల్లీల్లో ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, దారిన పోయే పెద్దల వరకూ దాడి చేసి ప్రాణాలు తోడేస్తున్నాయి. మోటారు సైకిల్‌పై వెళ్లే వారిని సైతం వెంబడిస్తున్నా యి. దొరికితే పిక్కలు పీకేస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజు కు సరాసరిన 100 కేసులు వస్తున్నాయి. నెలలో కనీసం ఒకటి నుంచి రెండు రేబిస్ కేసులు నమోదవుతున్నాయంటే కుక్కకాట్ల తీవ్రను అర్థం చేసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ ‘ఏబీసీ’ కార్యక్రమంపై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు.
‘భౌ’గోళిక సమస్యలతో..
కుక్కలు నిత్యం తిరిగే వారిని గుర్తిస్తాయి. కొత్త వ్యక్తులు వచ్చినా, కొత్త జీవాలు వచ్చినా వాటిలో తమ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని భావిస్తుంటాయి. జీహెచ్‌ఎంసీ జంతు జనన నియంత్రణ ఆపరేషన్లు చేపట్టిన తర్వాత ఒక ప్రాంతంలో పట్టిన కుక్కలను వేరే ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కొంత మంది కుక్కను కొన్నాళ్లకు విసుగొచ్చి మధ్యలో దూరం తీసుకెళ్లి విడిచిపెట్టేస్తున్నారు. దీంతో అవి ఒంటరిగా మారిపోతున్నాయి. వాటికి భౌగోళిక సమస్యలు (టెరిటోరియల్ బిహేవియర్) వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అక్కడుండే కుక్కలు కొత్తగా వచ్చినవాటిపై దాడి చేస్తున్నాయి. దీంతో వాటిల్లో అభద్రతా భావం నెలకొంటోంది. ఒకరకమైన ఉద్రేకమైన భావనలోకి వెళిపోతుంది. మనుషులను, జంతువులను శత్రువులుగా చూస్తుంది. సరైన ఆహారం, ఆవాసం లేకపోవడం సమస్యలతో దాడులకు తెగబడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్మానుష్య ప్రాంతాలు దాటాలంటే భయపడాల్సివస్తోంది.
రూ.30 కోట్లు ఖర్చు చేసినా..
ఒక్కో కుక్క ఒక దఫా 7 నుంచి 8 పిల్లలకి జన్మనిస్తుంది. జీహెచ్‌ఎంసీ, జంతు సంక్షేమ సంఘాలు జంతు జనన నియంత్రణ (ఏబీసీ), యాంటీ రేబిస్ కార్యక్రమాలను చేపడుతున్నాయి. సిటీ పరిధిలో 20 లక్షలకుపైగా కుక్కలు ఉండగా ఏటా సుమారుగా 50 వేల నుంచి 60 వేల వీధి కుక్కలను పట్టుకుని, జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్, యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నారు. ఏబీసీ కోసం గత రెండేళ్లలో రూ.30 కోట్లు ఖర్చు చేసినా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోతున్నారు.
రేబిస్ ప్రాణాంతకమే..
చల్లని వాతావరణంలో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటోంది. వీధి కుక్కల్లో ఒక కుక్కకు రేబిస్ సోకినా, అది గుంపులో కలవడం అన్నింటికి వైరస్ సోకుతోంది. మాస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. రేబిస్ వ్యాధి ప్రాణాంతకంగానే పరిణమిస్తుంది. రేబిస్ సోకిన కుక్కకు గొంతులో కండరాలు బిగుసుకుపోతాయి. నీరు, ఆహారం, చివరికి లాలాజలం కూడా మింగడానికి తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. ఆ కుక్క కరిసి నా, దాని లాలాజలం మనుషుల శరీరంపై ఉన్న గా యాలపై పడినా రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది.
నియంత్రణ ఒక్కటే మార్గం
గ్రేటర్‌లో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వాటిని నియంత్రణ ఒక్కటే మార్గం. జంతు కుటుంబ నియంత్రణ (ఏబీసీ)ఆపరేషన్ల సంఖ్యను, సంరక్షణ కేంద్రాలను పెంచాలి. కుక్క కరిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రంగా కడగాలి. వెంటనే డైద్యుడిని సంప్రదించి, (ఏఆర్‌బీ)యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కరిచిన కుక్కను గుర్తించి మున్సిపల్ వారికి అప్పగించాలి.
– డా. డి.అశోక్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్